దేశంలో వివిధ మార్గాల్లో వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఈ రైళ్ల టిక్కెట్ ధరలు తగ్గనున్నాయి. ఎంపిక చేసిన మార్గాల్లోనే ఈ టిక్కెట్ ధరలు తగ్గుతాయి. నిజానికి ఈ రైళ్లను ప్రవేశపెట్టిన తర్వాత ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది. టిక్కెట్ ధర కాస్త ఎక్కువైనప్పటికీ వేగంగా, సౌకర్యవంతంగా ఉండటంతో ప్రయాణికులు ఈ రైళ్ళలో ప్రయాణించేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 46 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో కొన్ని మార్గాల్లో మాత్రం ఈ రైళ్లకు ప్రయాణికుల ఆదరణ లభించడం లేదు.
కొన్ని మార్గాల్లో వందకు వంద శాతం ప్రయాణికుల ఆక్యుపెన్సీ ఉండగా మరికొన్ని మార్గాల్లో మాత్రం ప్రయాణికుల ఆక్యుపెన్సీ అతి తక్కువగా ఉంది. ముఖ్యంగా భోపాల్ - జబల్ పూర్ మధ్య పరుగులు పెట్టే వందే భారత్ రైలులో ప్రయాణికులే కరువయ్యారు. ఈ ట్రైన్ ఆక్యుపెన్సీ కేవలం 29 శాతం మాత్రమే. అలాగే, ఇండోర్ - భోపాల్ ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలు ఆక్యుపెన్సీ 21 శాతం, నాగ్‌పూర్ - బిలాస్‌పూర్ ప్రాంతాల మధ్య నడిచే రైలు ఆక్యుపెన్సీ 55 శాతం చొప్పున ఉంది. దీంతో ఈ మార్గాల్లో ప్రయాణ చార్జీని తగ్గించే విషయంపై ఉన్నత స్థాయి అధికారుల మధ్య చర్చ సాగుతోంది.
ఏసీ గది కోసం అత్తింటివారిపై దాడి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గర్భం దాల్చిన తమ కుమార్తె బిడ్డను ప్రసవించేందుకు ఏసీ గదిని ఏర్పాటు చేయలేదన్న కోపంతో అత్తింటి వారిపై పుట్టింటివారు దాడి చేశారు. ఏసీ లేని గదిలో తమ కుమార్తె ప్రసవించిందని తెలిసిన ఈ దాడికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో తొలుత వియ్యంకుడితో వాగ్వాదానికి దిగారు. చివరకు ఆయనపై దాడి చేశారు. దీనిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకీ జిల్లాకు చెందిన ఓ గర్భిణిని ఆమె అత్తింతిటివారు ప్రసంవం కోసం ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెను చూసేందుకు వచ్చిన పుట్టింటివారు తమ కుమార్తెను ఏసీ లేని గదిలో ఉంచి, అక్కడే ప్రసవించిందని తెలుసుకుని తీవ్ర ఆగ్రహోద్రుక్తులయ్యారు. పైగా, అత్తింటివారితో గొడవకు దిగారు. ఏసీ గది ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ గర్భిణి తల్లిదండ్రులు తమ వియ్యంకుడు రాజ్‌కుమార్‌తో గొడవకు దిగారు. చివరకు ఆయనపై చేయి చేసుకున్నారు. చివరకు ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో వారు ఇరు కుటుంబాల వారిని పిలిచి విచారిస్తున్నారు.