బిల్కిస్ బానో అనే మహిళ అత్యాచారం కేసులో దోషులుగా ఉంటూ జైలుశిక్షలు అనుభవిస్తున్న వారిని గుజరాత్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
నేరస్థులకు బీజేపీ మద్దతు పలుకడం మహిళల పట్ల ఆ పార్టీ వైఖరిని తేటతెల్లం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా రాజకీయాల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సిగ్గుపడటం లేదా అని రాహుల్ నిలదీశారు.
ఉన్నావ్, హత్రాస్, కథువా లైంగిక దాడి ఘటనలు, తాజాగా బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలను ప్రస్తావిస్తూ మహిళల పట్ల బీజేపీ వైఖరిని రాహుల్ ఎండగట్టారు. ఉన్నావ్‌లో బీజేపీ ఎమ్మెల్యేను కాపాడేందుకు ప్రయత్నించారని, కథువాలో రేపిస్టులకు అనుకూలంగా ర్యాలీ చేపట్టారని రాహుల్ గుర్తుచేశారు.
ఇక హత్రాస్‌లో రేపిస్టులకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించిందని తాజాగా గుజరాత్‌లో రేపిస్టులను విడుదల చేసి గౌరవించారని మండిపడ్డారు. నేరస్థులకు వత్తాసు పలుకుతూ బీజేపీ మహిళల పట్ల తన చౌకబారు వైఖరిని ప్రదర్శించిందని దుయ్యబట్టారు.