Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను చెప్తున్నా.. రాసిపెట్టుకోండి... వెనక్కి తగ్గాల్సిందే : రాహుల్ గాంధీ

నేను చెప్తున్నా.. రాసిపెట్టుకోండి... వెనక్కి తగ్గాల్సిందే : రాహుల్ గాంధీ
, గురువారం, 14 జనవరి 2021 (15:36 IST)
కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలపై రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతుల కష్టాలను చూసిన సుప్రీంకోర్టు.. ఈ చట్టాలకు తాత్కాలిక బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు వెల్లడించేవరకు చట్టాల అమలును నిలిపివేసింది. అదేసమయంలో సమస్య పరిష్కారనికి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటి రెండు నెలల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించనుంది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అదేసమయంలో చట్టాల అమలుపై సుప్రీం కోర్టు బ్రేక్ వేయడం కేంద్రానికి షాక్ కొట్టినట్టయింది. ఇదే అంశంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. నేను చెప్తున్నా.. రాసిపెట్టుకోండి. ఈ సాగు చట్టాలను వెనక్కితీసుకోక తప్పదు అంటూ చెప్పారు. 
 
సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆయన జల్లికట్టు పోటీలను తిలకించేందుకు గురువారం మదురైకు వచ్చారు. ఈ జిల్లాలోని అవనియాపురంలో జరిగిన జల్లికట్టు పోటీలను ఆయన తిలకించారు. ఆ తర్వాత సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. పిమ్మట విలేకరులతో మాట్లాడారు. 
 
‘‘నా మాటను గుర్తుంచుకోండి. జాగ్రత్తగా వినండి. కచ్చితంగా ప్రభుత్వం ఉపసంహరించుకోక తప్పదు. నా మాట రాసి పెట్టుకోండి.’’ అని రాహుల్ అన్నారు. ఓ వైపు రైతులను తొక్కేస్తూ, మరోవైపు పారిశ్రామిక వేత్తలకు కేంద్రం సహాయం చేస్తోందని విమర్శించారు. 
 
కరోనా సమయంలోనూ కేంద్రం సాధారణ ప్రజానీకానికి చేసిందేమీ లేదని, నరేంద్ర మోడీ ఎవరి ప్రధానిమంత్రో చెప్పాలని నిలదీశారు. మోడీ కేవలం ఇద్దరు, ముగ్గురు వ్యక్తుల ప్రధాన మంత్రేనా? అని రాహుల్ సూటిగా ప్రశ్నించారు. రైతులు ఈ దేశానికి వెన్నెముక లాంటివారని, వారిని అణచివేయాలని చూస్తే ఏం జరిగిందనేది చరిత్ర చూస్తే తెలుస్తుందని రాహుల్ చురకలంటించారు. 
 
దేశంలో రైతులు బలహీనపడ్డప్పుడల్లా దేశమూ బలహీనపడిందని ఆయన గుర్తు చేశారు. రైతులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఇద్దరు, ముగ్గురు బడా పారిశ్రామిక వేత్తల కోసం రైతులను నట్టేటా ముంచాలని చూస్తోందని ఆరోపించారు. రైతులకు సంబంధించిన రెండు, మూడింటిని కేంద్రం పారిశ్రామిక వేత్తలకు ఇవ్వాలని చూస్తోందని, దేశంలో ఇదే జరుగుతోందని రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. 
 
ఆ తర్వాత తమిళ సంస్కృతి సంప్రదాయాన్ని స్వయంగా వీక్షించిన ఆయన.. ఎంతో మంత్రుముగ్ధులయ్యారు. దేశ భవిష్యత్తుకు తమిళనాడు సంస్కృతి, భాష, చరిత్ర ఎంతో అవసరమన్నారు. అందుకే తమిళనాడుకు వచ్చినట్టు చెప్పారు. తమిళ ప్రజలతో కఠినంగా వ్యవహరించి, వారి సంస్కృతిని పక్కన పెట్టేయగలమని భావించే వారికి ఓ సందేశం ఇవ్వడానికే వచ్చానని రాహుల్ చెప్పుకొచ్చారు. 
 
తమిళ సంస్కృతిని, చరిత్రను చూసిన తర్వాత చాలా ముచ్చటేసిందని, జల్లికట్టును ఓ పద్ధతి ప్రకారం చక్కగా నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉందని ఆయన అన్నారు. అటు ఎద్దులు, ఇటు యువత క్షేమంగా ఉండే విధంగా, సురక్షిత పద్ధతిలో నిర్వహిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. తమిళ ప్రజలు తనపై అపార ఆదరాభిమానాలు చూయించారని, వారి సంస్కృతి, చరిత్ర రక్షించడం కనీస కర్తవ్యమని రాహుల్ తెలిపారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉరకలేస్తున్న ఆంబోతులు.. జోరుగా జల్లికట్టు పోటీలు....