Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళను 'ఐటమ్' అని పేర్కొనడం దురదృష్టకరం : రాహుల్

మహిళను 'ఐటమ్' అని పేర్కొనడం దురదృష్టకరం : రాహుల్
, మంగళవారం, 20 అక్టోబరు 2020 (15:34 IST)
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీ త‌ర‌పున అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో ఉన్న మ‌హిళా అభ్య‌ర్థి ఇమార్తి దేవిని ఐట‌మ్ అని పేర్కొంటూ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌మ‌ల్‌నాథ్ చేసిన వ్యాఖ్య‌లు ఆ రాష్ట్రంలో రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయ‌కుడు, ఎంపీ రాహుల్‌గాంధీ క‌మ‌ల్‌నాథ్ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. 
 
క‌మ‌ల్‌నాథ్ మా పార్టీ స‌భ్యుడే అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఉప‌యోగించిన భాష‌ను వ్య‌క్తిగ‌తంగా తాను స‌హించ‌న‌ని చెప్పారు. ఆయ‌నే కాదు ఇలాంటి వ్యాఖ్య‌లు ఎవ‌రు చేసినా తాను ఒప్పుకోను అని రాహుల్‌ మండిప‌డ్డారు. క‌మ‌ల్‌నాథ్ ఒక మ‌హిళ గురించి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు.
 
అంతకుముందు... మధ్యప్రదేశ్‌ రాష్ట్ర మహిళా మంత్రి ఇమార్తీ దేవిపై మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నవంబర్‌ 3వ తేదీన రాష్ట్రంలోని 28 స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో ఇమార్తీదేవి కూడా పోటీ చేస్తున్నారు. 
 
ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్‌నాథ్‌.. తమ పార్టీ అభ్యర్థి చాలా మంచి వ్యక్తి కాగా, ప్రత్యర్థి (బీజేపీకి చెందిన ఇమార్తీ దేవి) 'ఐటెం' అంటూ తూలనాడారు. దీనిపై బీజేపీ మండిపడింది. దళిత మంత్రిని కించపరిచేలా మాట్లాడిన కమల్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.
 
కమల్‌ వ్యాఖ్యలకు నిరసనగా సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, మంత్రులు, బీజేపీ నేతలు జ్యోతిరాదిత్య సిందియా తదితరులు సోమవారం రెండు గంటల మౌనదీక్ష చేపట్టారు. కమల్‌నాథ్‌పై చర్య తీసుకోవాలని సీఎం చౌహాన్‌.. కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీకి లేఖ రాశారు. 
 
దళిత మహిళల హక్కుల కోసం తరచూ గళమెత్తుతున్న కాంగ్రెస్‌ నేత ప్రియాంకాగాంధీ కమల్‌నాథ్‌ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలన్నారు. హరిజన మహిళను గౌరవించడం తెలియని కమల్‌నాథ్‌ను అన్ని బాధ్యతల నుంచి తప్పించాలని ఇమార్తీ దేవి కాంగ్రెస్‌ పార్టీని కోరారు. 
 
ముఖ్యమంత్రి పదవి కోల్పోయాక కమల్‌ మతి తప్పిందని ఇమార్తీ అన్నారు. కమల్‌ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ ఖండించింది.  ఆయనకు నోటీసులు జారీ చేయడంతోపాటు తగు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది.
 
ఎన్నికల ప్రచారంలో మహిళా అభ్యర్థిపై మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల కమిషన్‌ స్పందించింది. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక అందించాలని మధ్యప్రదేశ్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారిని ఆదేశించింది. 'ఈ అంశంపై మధ్యప్రదేశ్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి ఇప్పటికే నివేదిక అందజేశారు. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించాం. మంగళవారం అందే నివేదికను బట్టి ఎలాంటి చర్య తీసుకోవాలనే విషయం పరిశీలిస్తాం' అని పేర్కొంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలెక్టరు గారు, నాది కనీసం తహశీల్దారు స్థాయి కూడా కాదా? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తి