కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి రెండు రోజులు పాటు తన పార్లమెంటు పరిధిలోని వర్ష ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. కిషన్ రెడ్డి పర్యటనలో పలుమార్లు ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఆయన పర్యటనలను చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తాజాగా వర్ష ప్రభావిత ప్రాంతాల పర్యటనలోను కిషన్ రెడ్డికి ఇదే సమస్య ఎదురయింది. అయితే కిషన్ రెడ్డి వెంట పెద్ద స్థాయి అధికారులు ఎవరు లేరు. చిన్నా చితకా అధికారులు ఉన్నా, కొన్నిచోట్ల అది కూడా లేదట. దీంతో కిషన్ రెడ్డి కలెక్టర్‌కి ఫోన్ చేసి మాట్లాడారు. నాది కనీసం తహసీల్దార్ స్థాయి కూడా కాదా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి వచ్చి తిరుగుతుంటే స్థానిక అధికారులు కూడా లేకుంటే ఎందుకు తిరగాలి అని అడిగారు.
ఢిల్లీకి వెళ్ళిపొమ్మంటే వెళ్లిపోతా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. అధికారులు ప్రొటోకాల్ పాటించకపోతే వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి అడుక్కోవడం ఏంటని కార్యకర్తలు వాపోతున్నారు అంటున్నారు. కేటీఆర్ పర్యటనలో అధికారులు పోటాపోటీగా పాల్గొంటారని, కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ తిరిగితే ఉండరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
కిషన్ రెడ్డి మాత్రం వారు రాకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయని... ప్రస్తుత పరిస్థితిలో రాజకీయాలు చేయడం సరికాదని అంటున్నారు. ఇదే అంశాన్ని కార్యకర్తలు కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లితే ప్రోటోకాల్ అంశాన్ని తాను పట్టించుకోను, ఎవరిపైనా ఫిర్యాదు చేయను అని అంటున్నారట.