Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖమ్మం లేదా భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ?

rahul gandhi

వరుణ్

, మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (09:16 IST)
త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఆయన తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి లేదా ఖమ్మం లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేసేందుకు సమ్మతించినట్టు సమాచారం. నిజానికి ఖమ్మం లోక్‌సభ నుంచి కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ ఓ తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి కూడా పంపించింది. అయితే, ఆమె అనారోగ్య కారణాలతో ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు. అదేసమయంలో రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణా నుంచి పోటీ చేయించే విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. వారు ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి చేరవేయగా, ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. 
 
వచ్చే ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల్లో అత్యధిక సీట్లను గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇందులోభాగంగానే రాహుల్ గాంధీ పోటీని తెరపైకి తెచ్చింది. రాహుల్ గాంధీ తెలంగాణా నుంచి పోటీ చేయడం వల్ల ఆయన ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పడుతుందని, ఇది పార్టీతో పాటు.. కాంగ్రెస్ అభ్యర్థులకు ఎంతో మేలు చేకూర్చుతుందని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్‌బరేలి నుంచి ప్రియాంకా గాంధీలు పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంమీద రాహుల్ గాంధీ పోటీపై త్వరలోనే స్పష్టత రానుంది. 
 
ఇదిలావుంటే, ప్రస్తుతం రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌ స్థానం నుంచి ఈ దఫా సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా సతీమణి యూనిరాజా పోటీ చేయనున్నారు. ఈ మేరకు సీపీఐ ఆ స్థానానికి అభ్యర్థి పేరును కూడా ప్రకటించింది. దీంతో రాహుల్ గాంధీ మరోమారు వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయకపోవచ్చని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటు వేసేందుకు ఆధార్ కార్డు తప్పనిసరికాదు : కేంద్ర ఎన్నికల సంఘం