బీహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వాన్ని నడుపుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకోసం బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను పావుగా వాడుకుంటోందని ఆయన మండిపడ్డారు. బీహార్ రాష్ట్రంలో భాజపా నేతృత్వంలోని కేంద్రం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని విమర్శించారు. 
 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ప్రతిపక్షాలు పట్టుబట్టడం వల్లే నరేంద్ర మోడీ ప్రభుత్వం కుల గణనకు అంగీకరించిందన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముజఫర్ పూర్‌లో నిర్వహించిన తన తొలి ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు. మహారాష్ట్ర, హర్యానా ఓట్ల చోరీ జరిగిందని, బిహార్‌లోనూ ఇది పునరావృతమవుతుందని ఆరోపించారు.
	 
	'బీహార్ ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ ద్వారా నడుస్తోందని తేజస్వీ యాదవ్ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. భాజపా కేవలం నీతీశ్ కుమార్‌ను వాడుకుంటోంది. దేశసంపద కొంతమంది సంపన్నుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. బీహార్ వంటి ప్రాంతాలు పేదరికంలో కూరుకుపోవడానికి ఇదే కారణం. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టంపై ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారు. 
	 
	బీహార్ రాష్ట్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రజలు తమ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆధునిక నలంద విశ్వవిద్యాలయానికి కాంగ్రెస్ హయాంలోనే నాంది పడిందన్నారు. భవిష్యత్తులో అమెరికన్లు సైతం తమ ఉన్నత విద్య కోసం ఇక్కడి వస్తారని జోస్యం చెప్పారు.