కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరి రాష్ట్ర శాసనసభకు మంగళవారం పోలింగ్ జరుగుతోంది. మొత్తం 30 సీట్లున్న పుదుచ్చేరి రాష్ట్ర శాసనసభకు ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే, ఈ పోలింగ్ కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు శుభకార్యాల వేదికలను తలపిస్తున్నాయి.
పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఆకర్షించేందుకు అధికారులు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. శుభకార్యం జరుగుతున్న వేదికల్లా పోలింగ్ కేంద్రాలను అలంకరించారు. రంగురంగుల బెలూన్లతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
పోలింగ్ కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద బెలూన్లతోపాటు రంగురంగుల కాగితపు తోరణాలను ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎండలో ఇబ్బంది లేకుండా షామియానాలు ఏర్పాటు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కాగా, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.