Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోయంబత్తూరులో ర్యాగింగ్.. ఏడుగురు విద్యార్థుల సస్పెన్షన్

Advertiesment
Private College Student ragged
, గురువారం, 9 నవంబరు 2023 (13:37 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ర్యాగింగ్ భూతం వెలుగు చూసింది. సీనియర్ల రూపంలో కన్నూమిన్నూ గానకుండా ఓ జూనియర్లపై దాష్టీకానికి దిగింది. తమ తోడివాడేనన్న ఇంగితాన్ని మరచిన ఏడుగురు సీనియర్లు ఓ జూనియర్లపై అమానుషంగా ప్రవర్తించారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న కోపంతో అతనిపై దాడి చేయడంతో పాటు నగ్నంగా నిల బెట్టి గుండుగీశారు. ఆ దృశ్యాలను వీడియో తీశారు. అంతేగాకుండా వేకువజాము వరకు ఆ విద్యార్థిని చిత్ర హింసల పాల్లేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడటంతో కళాశాల యాజమాన్యం సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేసింది. 
 
అంతేగాక యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఏడుగురినీ అరెస్టు చేశారు. ర్యాగింగ్ నిరోధక చట్టాలు, హత్యా బెదిరింపు, అసభ్య దూషణ తదితర ఆరు రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సంచలనం రేపిన ఈ ఘటన వివరాలిలా వున్నాయి... కోవై అవినాశిరోడ్డులో నడుస్తున్న పాలిటెక్నిక్ తిరుప్పూర్ జిల్లా రాయర్పాలెంకు చెందిన 18 ఏళ్ల విద్యార్థి మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న మాధవన్, మణి, వెంకటేష్, తరణీధరన్, అయప్పన్, సంతోష్, యాలీస్ గత కొంతకాలంగా మొదటి సంవత్సరం విద్యార్థిపై వేధింపులకు పాల్పడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల ఓ రాత్రి మొదటి సంవత్సరం విద్యార్థి గదిలోకి వచ్చి తమకు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు అతను నిరాకరించడంతో తమ గదిలోకి రావాలని పిలిచారు. వారి ఉద్దేశాన్ని గ్రహించిన ఆ విద్యార్థి.. వారితో వెళ్లేందుకు నిరాకరించాడు. దాంతో ఆగ్రహించిన సీనియర్లు... జూనియర్‌ని బలవంతంగా ఓ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ అతనిపై దాడి చేశారు. నగ్నంగా మార్చి, గుండు గీశారు. ఈ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు. అనంతరం వేకువజాము వరకూ అతన్ని చిత్రహింసలు పెట్టారు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తా మంటూ బెదిరించారు. దాంతో ఆ విద్యార్థి భయపడి ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. 
 
అయితే సీనియర్లు చిత్రీకరించిన వీడియో దృశ్యాలు బయటకు రావడంతో అసలు విషయాన్ని గ్రహించిన కళాశాల యాజమాన్యం సీరియస్‌గా స్పందించింది. ప్రాథమిక విచారణ అనంతరం ఆ ఏడుగురినీ సస్పెండ్ చేసింది. అనంతరం పీలమేడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఏడుగురినీ అరెస్టు చేశారు. ఇదిలావుంటే ఈ విషయంపై రాష్ట్రప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందించింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్ గీత.. ర్యాగింగ్‌ను సహించేది లేదని, ఇలాంటి వ్యవహారంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ర్యాగిం‍‌గ్‌కు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని అన్ని కళాశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్