రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఇద్దరు మాజీ ప్రధానులతో పాటు ఐదుగురు ప్రముఖులకు భారతరత్న ప్రదానం చేశారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి ఆయన నివాసంలో సన్మానం జరగనుంది.
ఈ సంవత్సరం అత్యున్నత భారతీయ పౌర పురస్కారం ఇవ్వబడే ఐదుగురు వ్యక్తులలో, మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ, మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, పి.వి. నరసింహారావు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ రూపశిల్పి ఎంఎస్. స్వామినాథన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌లు వున్నారు. వీరి తరపున ఈ అవార్డులను సదరు కుటుంబీకులు పుచ్చుకున్నారు.
దివంగత ప్రధాని పీవీ నరసింహారావు తరఫున ఆయన కుటుంబం భారతరత్నను స్వీకరించింది. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీటిని ప్రదానం చేశారు. పీవీ తరఫున ఆయన తనయుడు ప్రభాకర్ రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
కర్పూరీ ఠాకూర్ తరఫున ఆయన తనయుడు రామ్‌నాథ్, చరణ్ సింగ్ తరఫున మనవడు జయంత్ సింగ్, స్వామినాథన్ తరఫున కూతురు నిత్యారావు అవార్డులను స్వీకరించారు. రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బీజేపీ అగ్రనేత అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును ప్రదానం చేయనున్నారు.