యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా 'ప్రతిభా సేతు' పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. దీని ద్వారా యూపీఎస్సీ అభ్యర్థులకు అనేక ప్రయోజనాలు ఉన్నట్లు మన్‌కీ బాత్ 125వ కార్యక్రమంలో మోడీ తెలిపారు. దేశంలోని కఠినమైన పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ ఒకటని.. ప్రతి యేడాది ఎంతో మంది అభ్యర్థులు రాస్తుంటారన్నారు. ఎంతో సమయం, డబ్బును ఖర్చు చేసి నిజాయతీగా కష్టపడుతున్న అభ్యర్థులు ఒక్కోసారి స్వల్ప తేడాతో సివిల్స్ తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోతున్నారని.. ఇలాంటి వారి కోసం ప్రతిభా సేతు పోర్టల్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, వరదలపై మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని పరీక్షిస్తున్నాయన్నారు. అనేక రాష్ట్రాల్లో భారీ వరదల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారని.. వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారన్నారు. తీవ్రంగా శ్రమిస్తున్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు, భద్రతా దళాలు, సామాజిక కార్యకర్తలు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
వినాశకరమైన ప్రకృతి వైపరీత్యాలు జమ్మూకశ్మీర్‌ను అతలాకుతలం చేస్తున్నప్పటికీ.. అనేక విషయాల్లో ముందుకు వెళ్తుందన్నారు. ఇటీవల శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో నిర్వహించిన ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ గురించి మోదీ ప్రస్తావించారు. దేశ్యాప్తంగా 800 మందికి పైగా అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారన్నారు. పురుషులతో సమానంగా మహిళా అథ్లెట్లు కూడా ఇందులో ప్రతిభ చూపారన్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా కాశ్మీర్‌లోని పుల్వామాలో తొలి సారిగా డే-నైట్ క్రికెట్ మ్యాచ్ జరిగిందని పేర్కొన్నారు. దేశం మార్పువైపు పయనిస్తోందనడానికి ఇవి ఉదాహరణగా నిలిచాయన్నారు.