Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజ్వల్ - ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే అరెస్టు చేస్తాం : కర్నాటక హోం మంత్రి

Prajwal Revanna

ఠాగూర్

, బుధవారం, 29 మే 2024 (12:07 IST)
మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మే 31న సిట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. తాను తప్పకుండా విచారణకు హాజరవుతానని ప్రజ్వల్ రేవణ్ణ ఇటీవల ఓ వీడియోలో వెల్లడించారు. ఓ మహిళ ఫిర్యాదు అనంతరం ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ పారిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. లైంగిక దాడి ఆరోపణలపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలో, కర్ణాటక హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర స్పందించారు.
 
ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టు విషయంలో ఎలాంటి ఆలస్యం చేయబోమని, ఆయన విమానం దిగగానే అరెస్టు చేస్తామని పరమేశ్వర వెల్లడించారు. ప్రజ్వల్ రేవణ్ణ భారత్‌కు తిరిగి రానున్న క్రమంలో ఆయనను ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసే విషయం సిట్ చూసుకుంటుందని అన్నారు. 'ప్రజ్వల్ రేవణ్ణ ఇటీవల వీడియో విడుదల చేసి తాను భారత్ వస్తున్నట్టు చెప్పారు. మే 31వ తేదీన ఏం జరుగుతుందో చూద్దాం' అంటూ హోంమంత్రి పరమేశ్వర వ్యాఖ్యానించారు.
 
ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడని, అతడి పత్రాల చెల్లుబాటు మే 31తో ముగుస్తుందని, ఒకవేళ అతడు ఎన్నికల్లో ఓడిపోతే అతడి దౌత్య పాస్ పోర్టును అక్కడి అధికారులు వెంటనే స్వాధీనం చేసుకుంటారని... అప్పుడైనా అతడు తిరిగి రాక తప్పదని హోంమంత్రి పరమేశ్వర వివరించారు. ఇవన్నీ అర్థం చేసుకునే ప్రజ్వల్ రేవణ్ణ భారత్ తిరిగొచ్చేయాలని నిర్ణయించుకుని ఉంటాడని అభిప్రాయపడ్డారు.
 
ఒకవేళ ప్రజ్వల్ రేవణ్ణ భారత్ కు రాకపోతే ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అప్పుడు ఇంటర్ పోల్ రంగంలోకి దిగుతుందని అన్నారు. దీనిపై తాము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని, ప్రజ్వల్ రేవణ్ణపై వారెంట్, బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ అయినట్టు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్... నిజమే.. లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించాం : నవాజ్ షరీఫ్