ఇక కాంగ్రెస్ పార్టీలో ఉడుకు రక్తమే : రాహుల్ గాంధీ
ఇక కాంగ్రెస్ పార్టీలో ఉడుకు రక్తమే ఉంటుందని ఆ పార్టీ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆయన పార్టీ అధినేతగా శనివారం బాధ్యతలు స్వీకరించారు.
ఇక కాంగ్రెస్ పార్టీలో ఉడుకు రక్తమే ఉంటుందని ఆ పార్టీ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆయన పార్టీ అధినేతగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ కార్యకర్తలను సోదరులుగా భావిస్తున్నామని.. అయితే వారి సిద్ధాంతాలను విభేదిస్తామన్నారు. ఒక సారి నిప్పు రాజేస్తే.. దాన్ని అదుపు చేయడం చాలా కష్టమవుతుందనీ… బీజేపీకి అది అర్థం కావడం లేదన్నారు.
కార్యకర్తలందరూ.. తన కుటుంబ సభ్యులే అన్నారు. యువకులు కావొచ్చు… పెద్దలు కావొచ్చు.. వారందరూ తనవాళ్లన్నారు. “మిమ్మల్నిందరి నేను అభిమానిస్తున్నాను. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ను… రాబోయే రోజుల్లో గ్రాండ్ ఓల్డ్ అండ్ యంగ్ పార్టీగా మారుద్దాం. నన్ను మీ సోదరుడిగా భావించండి.. మాతో చేతులు కలపండి” అని పిలుపునిచ్చారు.
దేశంలో ప్రతి గ్రామానికి.. ప్రతి నగరానికి వెళదామన్నారు. గ్రామగ్రామాన కార్యకర్తలను రక్షించుకోవడం తన బాధ్యతన్నారు. కాంగ్రెస్ లేకుండా చేయాలని బీజేపీ భావిస్తోంది. తుడిచిపెట్టేయాలని చూస్తోంది. నిప్పును నిప్పుతో కొట్టాలని కాంగ్రెస్ భావించడంలేదు. ప్రేమతో … బాధ్యతతో గెలవాలని చూస్తోందన్నారు.
పెద్దల నుంచి నేర్చుకోవడానికి ఎప్పుడూ ముందుంటానన్న ఆయన… తనకు అమూల్యమైన సలహాలిచ్చిన మన్మోహన్, సోనియాగాంధీ, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలు ప్రజాసేవకు ఉపయుక్తంగా లేకుండా ఉన్నాయని, రాజకీయ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల మధ్య బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోందని, ఒకసారి విద్వేషాలు చెలరేగితే అణచివేయడం చాలా కష్టమని రాహుల్ అన్నారు.