Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓ యేడాది వాయిదా వేస్తాం... చర్చలకు సర్వదా సిద్ధం : ప్రధాని మోడీ

ఓ యేడాది వాయిదా వేస్తాం... చర్చలకు సర్వదా సిద్ధం : ప్రధాని మోడీ
, శనివారం, 30 జనవరి 2021 (16:44 IST)
కేంద్రం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాల అమలును మరో యేడాది పాటు వాయిదా వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. అదేసమయంలో రైతులతో చర్చలకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా, ఒక ఫోన్‌కాల్‌కు దూరంలో ఉందన్నారు.
 
పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం ఇప్పటికీ సిద్ధంగానే ఉందని వెల్లడించారు. 
 
'కేంద్రం రైతుల సమస్యను పెద్ద మనసుతో పరిశీలిస్తోందని ప్రధాని అఖిల పక్ష సమావేశంలో హామీ ఇచ్చారు. జనవరి 22న వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఇప్పటికీ కట్టుబడి ఉంది. తోమర్ జీ మీతో చర్చించడానికి ఫోన్ కాల్ దూరంలో ఉంటారనే విషయాన్ని ఈ సమావేశంలో ప్రధాని మరోసారి గుర్తు చేశారు' అని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. 
 
రైతులు, కేంద్రం మధ్య తొమ్మిది దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో.. ఏడాదిన్నర పాటు చట్టాలను నిలిపివేసే  ప్రతిపాదనను కేంద్రం అన్నదాతల ముందు ఉంచింది. రైతులు మాత్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఆ మూడు సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీనికి కేంద్రం సమ్మతించడం లేదు. 
 
చివరి దఫా చర్చలు కూడా విఫలం కావడంతో.. ‘బంతి మీ కోర్టులోనే ఉంది. చట్టాలు రద్దు మినహా.. మేము సూచించినదానికంటే మెరుగైన ఆలోచన ఉంటే చెప్పాలి’ అని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతు సంఘాలకు సూచించారు. 
 
మరోవైపు, చట్టాల రద్దుకే పట్టుబట్టిన రైతులు.. గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీ ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా ఎర్రకోట దగ్గర నిరసనలు వ్యక్తం చేయడంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఔటర్ రింగు రోడ్డులో డివైడ్‌ను ఢీ కొట్టిన కారు, ఐదుగురికి తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం