ప్రధాని మోదీకి పంజాబ్ పర్యటనలో చేదు అనుభవం ఎదురయింది. ఆయన పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం కలకలం రేపుతోంది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్ పై దాదాపు 20 నిమిషాల సేపు నిలిచిపోయింది. నిరసనకారులు రోడ్డును నిర్బంధించడంతో మోదీ ఫ్లైఓవర్ పైనే ఆగిపోయారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఇది అతి పెద్ద భద్రతా లోపమని కేంద్ర హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరోవైపు ఈ ఘటన జరిగిన ప్రదేశం నుంచి భతిండా ఎయిర్ పోర్టుకు మోదీ తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు వద్ద ఉన్న అధికారులతో ఆయన మాట్లాడుతూ, 'భతిండా ఎయిర్ పోర్టు వరకు నేను ప్రాణాలతో రాగలిగాను. మీ సీఎంకు థ్యాంక్స్' అని అన్నారు. మరోవైపు ఈ ఘటన వల్ల ప్రధాని మోదీ ఫిరోజ్ పూర్ ర్యాలీ రద్దయింది. దీనిని పీఎంఓ సీరియస్ గా పరిగణిస్తోంది.