Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్ గంట భేటీ... ఏం మాట్లాడుకున్నారు?

Advertiesment
ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్ గంట భేటీ... ఏం మాట్లాడుకున్నారు?
విజ‌య‌వాడ‌ , సోమవారం, 3 జనవరి 2022 (18:38 IST)
న్యూఢిల్లీలో నరేంద్ర మోదీతో సీఎం వైయస్‌.జగన్ ప్ర‌ధాని నివాసంలో సమావేశం అయ్యారు. సుమారు గంటసేపు వీరిద్ద‌రి భేటీ కొన‌సాగింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్‌ సమస్యలను ప్రధానికి సీఎం నివేదించారు. ఒక విజ్ఞాపన పత్రం కూడా అందించి, రాష్ట్ర స‌మ‌స్య‌ల్ని నివేదించారు. 
 
 
రాష్ట్ర విభజన పర్యవసానాలు ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బ తీశాయ‌ని, విభజన సమయంలో 58 శాతం జనాభా ఏపీకి రాగా, కేవలం 45 శాతం రెవిన్యూ మాత్రమే దక్కింద‌ని సీఎం వివ‌రించారు. 2015–16లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.15,454 కాగా, ఏపీ తలసరి ఆదాయం రూ.8,979 మాత్రమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో తెలియచేయడానికి ఈ ఒక్క గణాంకాలే నిదర్శనం అని తెలిపారు. భౌగోళికంగా చూస్తే తెలంగాణ కన్నా, ఆంధ్రప్రదేశ్‌ పెద్దది, ఇక్కడుండే జనాభా కూడా ఎక్కువ. ప్రజల అవసరాలను తీర్చాలంటే, వారికి సరైన సేవలు అందించాలంటే అంతే స్థాయిలో వ్యయం కూడా చేయాల్సి ఉంటుంద‌న్నారు. విభజన వల్ల రాజధానిని కూడా ఏపీ కోల్పోయింద‌న్నారు. 
 
 
2013 నాటి భూ సేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా పెరిగింది. ఏప్రిల్‌ 1, 2014 అంచనాల మేరకే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో తెలియజేసింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదు. అంతే కాకుండా అప్పటివరకూ ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ రూపంలో చేసిన ఖర్చులనూ మినహాయించారు. దీని వల్ల పెరిగిన ప్రాజెక్టు అంచనాల భారం అంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతోంది.


ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో సెక్షన్‌–90లో పేర్కొన్న స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో వ్యయం కూడా పెరుగుతుంది. ప్రాజెక్టు ఖర్చులో అధిక భాగం 2013 నాటి భూసేకరణ చట్టం అమలుకే వ్యయం చేయాల్సి ఉంటుంది. చట్టం ప్రకారం ముంపు ప్రాంతాల నుంచి తరలించాల్సిన కుటుంబాలకు ప్యాకేజీలను కూడా విస్తరించాల్సి ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర భారం. భూ సేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌  రూపేణా సవరించిన అంచనాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు తిరస్కరించడం ప్రాజెక్టుకు తీవ్ర విఘాతం కలిగిస్తుంద‌న్నారు. 
 
 
అవశేష ఆంధ్రప్రదేశ్‌కు రెవిన్యూ లోటును పూడుస్తామంటూ అప్పటి ప్రధానమంత్రి ఫిబ్రవరి 20, 2014న రాజ్యసభలో ప్రకటన చేశారు. రాష్ట్ర విభజన జరిగే తేదీ నాటికి, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు తేదీకి మధ్యనున్న రిసోర్స్‌ గ్యాప్‌ను 2014–15 కేంద్ర బడ్జెట్‌ ద్వారా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. 2014 జూన్‌ నుంచి మార్చి 31, 2015 వరకూ ఉన్న రీసోర్స్‌ గ్యాప్‌ మొత్తం రూ.16,078.76 కోట్లని కాగ్‌ నిర్ధారించింది.


ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం (స్టాండరై్డజ్డ్‌ ఎక్స్‌పెండేచర్‌) పేరిట కొత్త పద్ధతిని తీసుకు వచ్చింది. రీసోర్స్‌ గ్యాప్‌ను కేవలం రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది. దీంతో నిధుల కొరత వల్ల 2014–15 ఆర్థిక సంవత్సరంలో చాలా బిల్లులను, పీఆర్సీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేకపోయింది. 2014–15లో చెల్లించాల్సిన బిల్లులను, ఇతర బకాయిలను పరిగణలోకి తీసుకుంటే రెవిన్యూ లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది కేవలం రూ.4,117.89 కోట్లు మాత్రమే. చాలా కాలంగా పెండింగులో ఉన్న మిగిలిన రూ.18,830.87 కోట్లు చెల్లించి రాష్ట్రానికి అండగా నిలవాలని ప్ర‌ధానిని కోరారు.
 
 
ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంద‌ని, 2019–2020 ఆర్థిక మందగమనం కూడా ఏపీపై ప్రభావం చూపింద‌న్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రూ.34,833 కోట్లు అయితే వాస్తవంగా వచ్చింది రూ.28,242 కోట్లు మాత్రమే. 2020–21లో కోవిడ్‌ పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బ తీశాయి. కేంద్ర పన్నుల్లో రూ.7.780 కోట్ల మేర నష్టం వాటిల్లింది. రాష్ట్రం ఆదాయ వనరుల నుంచి రావాల్సిన రూ.7 వేల కోట్లు కూడా రాకుండా పోయాయి. దీంతోపాటు కోవిడ్‌ నివారణా చర్యల కోసం దాదాపు రూ.8 వేల కోట్లు ఖర్చు చేశాం. వీటితోపాటు రాష్ట్ర ప్రజలు నష్టపోయిన ఆదాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ నష్టం వేల కోట్లలో ఉంటుంది.


ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల (డీబీటీ) ద్వారానే జీవనోపాధి కోల్పోయిన ప్రజలను ఆదుకోగలమని రాష్ట్ర ప్రభుత్వం విశ్వసించింది. ఎంతటి కష్టనష్టాలు ఎదురైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధి నుంచి పక్కకు వెళ్లలేదు. అంకిత భావంతో ఆ పథకాలను అమలు చేసింది. ప్రజల చేతిలో నేరుగా డబ్బు పెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతం కావడమే కాదు, ఎలాంటి అవినీతి, పక్షపాతం లేకుండా పారదర్శక పద్ధతిలో అత్యంత సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకుంద‌న్నారు.
 
 
2021–22 కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం గరిష్ట రుణ పరిమితి (నెట్‌ బారోయింగ్‌ సీలింగ్‌–ఎన్‌బీసీ) ని రూ. 42,472 కోట్లుగా నిర్ధారించారు. తదుపరి కేంద్ర ఆర్థిక శాఖ దీన్ని రూ.17,923.24 కోట్లకు తగ్గిస్తున్నట్టుగా సమాచారం ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో చేసిన అధిక అప్పులను పరిగణలోకి తీసుకుని ఆమేరకు నిర్దేశించిన రుణ పరిమితిని సర్దుబాటు చేసినట్టుగా పేర్కొంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మా తప్పు లేకుండానే ఈ విధంగా రుణ పరిమితిలో కోత విధంచడం సరి కాదు. రుణపరిమితిలో కోతను మూడేళ్లకు విస్తరించాలని చేసిన విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. మేం తీసుకుంటున్నవి అప్పులే కాని, గ్రాంట్లు కాదన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాం.


తీసుకుంటున్న రుణాలకు  సకాలంలో చెల్లింపులు కూడా చేస్తున్నాం. గత ప్రభుత్వం తమ ఐదేళ్ల కాలంలో అధికంగా అప్పులు చేశారన్న కారణంగా ఇప్పుడు ఈ క్లిష్ట సమయంలో కోత విధించడం రాష్ట ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తుంది. ప్రభుత్వాలు ఖర్చు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకు ఎక్కించాల్సిన ప్రస్తుతం తరుణంలో విధిస్తున్న పరిమితులు ఇలాంటి అవకాశాలకు ఆస్కారం ఇవ్వదు. గత ఐదేళ్ల కంటే ముందు ఇచ్చిన రుణ పరిమితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్పులు తీసుకోలేదనే అంశానికి సంబంధించి మీ ముందు వివరాలు సమర్పిస్తున్నాను. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని 2021–22 కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం ఎన్‌బీసీని రూ.42,472 కోట్లుగా నిర్ధారించిన మేరకు అప్పులు తెచ్చుకునేందుకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నా అని జ‌గ‌న్ వివ‌రించారు.. 
 
 
భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి సైట్‌ క్లియరెన్స్‌ అప్రూవల్‌ను రెన్యువల్‌ చేయాలని, వైయస్సార్‌ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి మెకాన్‌  సంస్థచే వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చూడాలని కోరారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

online games ఆడి అప్పుల్లో ఇరుక్కున్నాడు, అడిగినందుకు భార్యాపిల్లల్ని చంపేసి...