ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ పేరుతో కర్నూలు శివారులోని నన్నూరు వద్ద భారీ బహిరంగ సభ జరుగుతోంది. 450 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది సభకు హాజరయ్యారు. ఈ వేదిక నుంచే ప్రధాని మోదీ రూ.13,429 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
జీఎస్టీ 2.0 నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ నుంచే విస్తృత ప్రచారం ప్రారంభించింది. ప్రధాని ఉదయం దిల్లీ నుంచి బయల్దేరి కర్నూలు చేరుకుని, అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కర్నూలు సభకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.
అయితే ఈ సభలో అపశృతి చోటుచేసుకుంది. నన్నూరు సభా ప్రాంగణం వద్ద కరెంట్ షాక్ కొట్టి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలైనాయి. మృతుడు కర్నూలు జిల్లా మునగాలపాడు గ్రామానికి చెందిన అర్జున్‌గా గుర్తించారు.