Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

10న కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి భూమిపూజ

10న కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి భూమిపూజ
, ఆదివారం, 6 డిశెంబరు 2020 (13:51 IST)
కొత్త పార్లమెంట్ భవనానికి ఈ నెల 10వ తేదీన ప్రధాని మోడీ భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని మోడీని ఆయన నివాసానికి వెళ్లి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ఆహ్వానించారు. దీంతో ప్రధాని కూడా సమ్మతం తెలిపి, భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 
 
కొత్త పార్లమెంటు భవనం త్రిభుజాకారంలో ఉండబోతోంది. ప్రస్తుత పార్లమెంటు భవనం పక్కన దీన్ని నిర్మించనున్నారు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ భవనాన్ని నిర్మించబోతోంది. రూ.861.90 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. సెంట్రల్ విస్తా పేరుతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. 
 
ఈ ప్రాజెక్ట్ కోసం ఎల్‌అండ్‌టీ కూడా బిడ్ వేసింది. అయితే టాటా కంటే కొంచెం ఎక్కువగా అంటే రూ.865 కోట్లకు టెండర్ వేసింది. దీంతో, దానికంటే తక్కువ ధర కోట్ చేసిన టాటాకు కాంట్రాక్ట్ దక్కింది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఈ భవన నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని రూ.940 కోట్లుగా అంచనా వేసింది.
 
కొత్త పార్లమెంటు భవనంలో ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రతిబింభించేలా కాన్స్టిట్యూషన్ హాల్ ఉంటుంది. దీంతో పాటు ఎంపీల లాంజ్, లైబ్రరీ, పెద్ద సంఖ్యలో కమిటీ గదులు, డైనింగ్ ఏరియాలతో పాటు సువిశాల పార్కింగ్ ఉంటుంది. 
 
భూకంపాలను సైతం తట్టుకునేలా అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని నిర్మించనున్నారు. ఈ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా 2 వేల మంది, పరోక్షంగా 9 వేల మంది ఉపాధిని పొందబోతున్నారు. 1200 మంది ఎంపీలకు సరిపడేలా భవనం ఉంటుందని ఓం బిర్లా తెలిపారు.
 
ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనాన్ని బ్రిటీష్ హయాంలో నిర్మించారు. ఎడ్విన్ లూట్యెన్స్, హర్బర్ట్ బేకర్‌ల పర్యవేక్షణలో దీని నిర్మాణం జరిగింది. ఈ భవనం పాతబడిపోయిందని, కొత్త భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
 
2022లో మన దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకునే సమయంలో ఈ కొత్త భవనంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని ఓం బిర్లా చెప్పారు. అంటే.. రెండేళ్ళలోనే ఈ కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తికానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెలకు సరిపడ నిత్యావసరాలతో ట్రాక్టర్లపై ఢిల్లీకి బయలుదేరిన రైతులు!