తమిళ భాష, సంస్కృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. తమిళ సంస్కృతి విశ్వవ్యాపితం అంటూ కొనియాడారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలో తమిళనాడు ప్రత్యేక ప్రాంతం అని కితాబిచ్చారు.
ప్రధాని మోడీ గురువారం చెన్నై పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన రూ.32 వేల కోట్ల విలువైన 11 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వీటిలో 262 కిమీ పొడవైన చెన్నై - బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ హైవేను కూడా ఉంది.
ఈ సందర్భంగా ఆయన తమిళ భాషపై అమితమైన ప్రేమాభిమానాలను చూపించారు. తమిళం శాశ్వతమైన భాషగా అభివర్ణించారు. తమిళనాడు ఓ ప్రత్యేకమైన ప్రాంతం, తమిళ సంస్కృతి విశ్వవ్యాప్తం అని కీర్తించారు.
అలాగే, కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాతీయ విద్యా విధానంపై ఆయన మాట్లాడుతూ, సాంకేతిక, వైద్య కోర్సులు స్థానిక భాషల్లో అభ్యసించడం తమిళనాడు యువతకు ఎంతో లాభదాయకమని మోడీ పేర్కొన్నారు.
అదేసమయంలో శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అత్యంత దయనీయ స్థితికి దిగజారిన శ్రీలంకకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని ప్రకటించారు. ఆర్థికంగా తోడ్పాటు అందించడమే కాకుండా ఇంధనం, ఆహారం, ఔషధాలు, ఇతర నిత్యావసరాలు అందిస్తామని తెలిపారు.