దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రధానిగా జాతీయ జెండాను ఎగురవేయడం ఇది ఎనిమిదోసారి. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ప్రకటనలు చేశారు.
దేశవ్యాప్తంగా గల అన్ని సైనిక పాఠశాలల్లో ఇకపై బాలికలకు కూడా ప్రవేశం కల్పించనున్నట్లు మోడీ ప్రకటించారు. ఇంతవరకూ బాలురకు మాత్రమే సైనిక స్కూళ్లలో ప్రవేశం కల్పించేవారు.
దేశ రక్షణ రంగంలో యువతులకూ ప్రాధాన్యత కల్పిస్తున్న నేపథ్యంలో సైనిక స్కూళ్లలో బాలికలకు ప్రవేశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, జమ్మూకాశ్మీర్ ఎన్నికలపై మోడీ కీలక ప్రకటన చేశారు.
త్వరలోనే అక్కడ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో నూతన సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. రేషన్ దుకాణాల్లో పోషకాహారాన్ని అందిస్తామని, దేశంలోని ప్రతి ఇంటీకీ కుళాయి ద్వారా నీరు వచ్చే ఏర్పాట్లు చేస్తామని ఎర్రకోట వేదికగా మోడీ హామీనిచ్చారు.
శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రబల శక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని సూచించారు. భారత్‌కు వచ్చే 25 ఏళ్ల కాలం అమృత ఘడియలు అని చెప్పారు. ఈ అమృత కాలాన్ని సర్వ సమృద్ధ భారత నిర్మాణానికి మనం సంకల్పం తీసుకోవాలన్నారు.
అయితే కేవలం సంకల్పం తీసుకుంటే సరిపోదని, నిరంతర శ్రమ, పట్టుదల కావాలన్నారు. పౌరులందరి భాగస్వామ్యంతోనే సమృద్ధ భారతం నిర్మాణం అవుతుందన్నారు. అలాగే, రేషన్ షాపుల్లో పోషకాహార ధాన్యాలు అందించే ఏర్పాట్లు చేస్తామని ప్రధాని పేర్కొన్నారు.