ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఇది ఆదివారానికి ఐదో రోజుకు చేరుకుంది. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని భారత పౌరులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారిని సురక్షితంగా మాతృదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందుకోసం ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేక విమానాలను నడుపుతోంది. ఇప్పటికే ఐదు విమానాల్లో అనేక మంది మాతృదేశానికి చేరుకున్నారు.
ఇదిలావుంటే, ఆపరేషన్ గంగను వేగవంతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని విషయాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులోభాగంగా, ఉక్రెయిన్‌లోని భారత పౌరులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపిస్తున్నారు.
వీరిలో హర్దీప్ సింగ్ పూరీ, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజుజు, వీకే సింగ్‌లు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్ళనున్నారు. ఉక్రెయిన్‌లో దాదాపు 16 వేల మంది విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. వారందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేలా కేంద్రం దృష్టిసారించింది.