పియూష్ గోయెల్‌కు పదోన్నతి.. రైల్వే శాఖ అప్పగింత..
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా, నలుగురు మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదోన్నతి కల్పించారు. వీరిలో ఒకరు పియూష్ గోయల్ కాగా, మిగిలినవారిలో ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్, ము
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా, నలుగురు మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదోన్నతి కల్పించారు. వీరిలో ఒకరు పియూష్ గోయల్ కాగా, మిగిలినవారిలో ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నక్వీలు ఉన్నారు.
అయితే, వీరంతా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ పొందిన పీయూష్ గోయెల్‌కు రైల్వే శాఖ కేటాయించారు. అటు రక్షణశాఖను మాత్రం అరుణ్ జైట్లీకే అప్పగించారు. అంటే ఆర్థికశాఖతోపాటు రక్షణ శాఖ బాధ్యతలు జైట్లీనే మోయనున్నారు.
ఇక ఇప్పటివరకు రైల్వే శాఖ బాధ్యతలు చూసి సురేశ్ ప్రభు.. ఇవాళ ఉదయమే ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే ఉద్యోగులకు వీడ్కోలు ట్వీట్ చేశారు. వరుస రైలు ప్రమాదాలపై తీవ్రంగా కలత చెందిన ప్రభు.. గత నెల 23నే ప్రధానిని కలిసి రాజీనామా చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. కాస్త ఆగమని అప్పుడు చెప్పిన ప్రధాని.. ఇప్పుడు పునర్వ్యవస్థీకరణలో భాగంగా రైల్వేలను గోయెల్‌కు అప్పగించారు.
విద్యుత్, బొగ్గు రంగాల్లో గోయెల్ చేపట్టిన సంస్కరణలు ఆయనకు ప్రమోషన్ సాధించిపెట్టాయి. అంతేకాదు కీలకమై రైల్వే శాఖ బాధ్యతలు ఆయనకు అప్పగించడం విశేషం. అయితే కొన్నాళ్లుగా వరుస ప్రమాదాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆ శాఖ బాధ్యతలు చేపట్టడం నిజంగా గోయెల్‌కు సవాలే.