Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రధాని నరేంద్ర మోడీ నవరత్నాలు.. ఇదీ వారి నేపథ్యం...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కొత్తగా 9 మంది మంత్రులు చేరారు. వీరిలో అనంత కుమార్ హెగ్డే (కర్ణాటక), వీరేంద్ర కుమార్ (మధ్యప్రదేశ్), అశ్వనీ కుమార్ చౌబే (బీహార్), గజేంద్ర సింగ్ షెకావత్ (రాజస్థాన

ప్రధాని నరేంద్ర మోడీ నవరత్నాలు.. ఇదీ వారి నేపథ్యం...
, ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (12:28 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కొత్తగా 9 మంది మంత్రులు చేరారు. వీరిలో అనంత కుమార్ హెగ్డే (కర్ణాటక), వీరేంద్ర కుమార్ (మధ్యప్రదేశ్), అశ్వనీ కుమార్ చౌబే (బీహార్), గజేంద్ర సింగ్ షెకావత్ (రాజస్థాన్), శివ ప్రతాప్ శుక్లా (యూపీ), అల్ఫోన్స్ కన్నన్‌ థానమ్ (కేరళ), హర్దీప్ సింగ్ పూరీ (పంజాబ్), రాజ్ కుమార్ సింగ్ (బీహార్), సత్యపాల్ సింగ్ (యూపీ)లు ఉన్నారు. ఈ నవరత్నాల నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే..
 
సత్యపాల్‌ సింగ్‌ : మాజీ ఐపీఎస్‌ అధికారి అయిన సింగ్‌ ప్రస్తుతం యూపీలోని బాగ్‌పత్‌ నుంచి ఎంపీగా ఉన్నారు. హోం శాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలో సభ్యుడిగా, లాభదాయక పదవుల సంయుక్త కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఏపీ, మధ్యప్రదేశ్‌లలో నక్సలైట్ల నియంత్రణకు కృషిచేసినందుకు 1990లో ప్రత్యేక సేవా పతకాన్ని అందుకున్నారు. 1990ల్లో ముంబైలో వ్యవస్థీకృత నేర వ్యవస్థ నడ్డి విరిచినందుకు ప్రశంసలందుకున్నారు. ముంబై, పుణె నగరాల పోలీస్‌ కమిషనర్‌గానూ పనిచేశారు. ఈయన ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లోని మావోయిస్టుల ప్రాంతాల్లో పోలీసు అధికారిగా పని చేశారు. ఢిల్లీ యూనివర్శిటీలో కెమిస్ట్రీలో ఎంఫిల్ చేసిన సత్యపాల్ సింగ్.. తర్వాత ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదివారు. నక్సలిజంపై పీహెచ్‌డీ చేశారు. 
 
అశ్వనీ కుమార్ చౌబే: అశ్వనీ కుమార్ చౌబే బీహార్‌లోని బక్సర్ నియోజకవర్గ ఎంపీ. ఐదుసార్లు బీహార్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 8 సంవత్సరాల పాటు బీహార్ మంత్రిగా పని చేశారు. జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో పాల్గొన్న అశ్వనీ కుమార్ చౌబే... ఎమర్జెన్సీ సమయంలో జైలుకి వెళ్లారు. బీఎస్సీ జువాలజీ చదివిన ఈయన పాట్నా యూనివర్శిటీ విద్యార్థి నేతగా పని చేశారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లపాటు పట్టణాభివృద్ధి, ప్రజారోగ్యం తదితర మంత్రిత్వ శాఖలు నిర్వహించారు.
 
అనంత్ కుమార్ హెగ్డే: ఉత్తర కర్ణాటక నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇస్పటికి ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 28 ఏళ్ల వయసులోనే లోక్‌సభలో అడుగు పెట్టిన రికార్డు ఈయనది. ఉత్తర కర్ణాటకలో గ్రామీణాభివృద్ధి కోసం "కదంబ" అనే స్వచ్ఛంద సంస్ధను స్థాపించి అనేక సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. అనంత్ కుమార్ హెగ్డే... కొరియన్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యుడు. విదేశాంగ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. గ్రామీణాభివృద్ధి, గ్రామీణారోగ్యం, స్వయం సహాయక సంఘాలు తదితర రంగాల్లో సేవలందిస్తున్నారు. 
 
రాజ్ కుమార్ సింగ్: బీహార్‌కు చెందిన ఈయన.. అర్రా లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ. 1975 బ్యాచ్‌కి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. గతంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి స్థాయి వరకు ఎదిగారు. అలాగే హోం శాఖ సంయుక్త కార్యదర్శిగా, డిఫెన్స్ ప్రొడక్షన్ కార్యదర్శిగా కూడా పని చేశారు. అలాగే బీహార్ ప్రభుత్వ శాఖల్లో అనేక కీలక పదవులు నిర్వహించారు. రాజ్ కుమార్ సింగ్.... పోలీసు శాఖ,  జైళ్ళ శాఖ ఆధునీకీకరణ కోసం ఎంతో కృషి చేశారు. అలాగే విపత్తు నిర్వహణ మేనేజ్ మెంట్ కోసం ప్రణాళికలు రూపొందించారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సిబ్బంది, పింఛన్లు, ప్రజా ఫిర్యాదులపై ఏర్పాటైన వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో సభ్యుడిగా ఉన్నారు. 
 
గజేంద్ర సింగ్ షెకావత్: ఈయన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ. వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్నవారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటడం వల్ల ఈయన బ్లాగ్‌కి చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. గజేంద్ర సింగ్ షెకావత్... క్రీడాకారుడు కూడా. బాస్కెట్ బాల్ జాతీయ స్థాయి ప్లేయర్. ప్రస్తుతం ఆలిండియా స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యుడిగా... బాస్కెట్ బాల్ ప్లేయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గజేంద్ర సింగ్ షెకావత్... ఫిలాసఫీలో ఎంఫిల్ చేశారు. ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా, ఫెలోషిప్‌ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
 
శివ ప్రతాప్ శుక్లా: ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన శుక్లా... రాజ్యసభ ఎంపీ. గతంలో ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. ఉత్తర ప్రదేశ్ మంత్రిగా ఎనిమిది సంవత్సరాల పాటు పని చేశారు. గోరఖ‌్‌పూర్ యూనివర్శిటీ నుంచి లా డిగ్రీ పొందిన శివ ప్రతాప్ శుక్లా... రాజకీయాల్లోకి రాకముందు విద్యార్థి నేతగా ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో 19 నెలలు అరెస్టయ్యి జైల్లో ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా గ్రామీణాభివృద్ధి, విద్య, జైళ్ల శాఖల్లో సంస్కరణలు చేపట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యునిగా ఉన్నారు.
 
అల్ఫోన్స్ కన్నన్‌ థానమ్: ఈయన కేరళకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. గతంలో ఢిల్లీ డెవలెప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌గా పని చేసిన ఈయనకు.... ఢిల్లీ డెమోలిషన్ మ్యాన్‌గా పేరుంది. ఆ సమయంలో అల్ఫోన్స్ కన్నన్‌ థానమ్... దాదాపు 15 వేల అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూలగొట్టించారు. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగి పోయింది. కేరళలో కరెంట్ కూడా లేని మూరుమూల గ్రామంలో పుట్టిన అల్ఫోన్స్... రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. 1998లో కొట్టాయం జిల్లా కలెక్టర్‌గా పని చేసిన సమయంలో దేశంలోనే వంద శాతం అక్షరాస్యత సాధించిన తొలి జిల్లాగా తీర్చి దిద్దారు. అలాగే ప్రభుత్వ జవాబుదారీతనంపై పోరాడటానికి 1994లో జనశక్తి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. టైమ్స్ మ్యాగజైన్ వంద మంది యంగ్ గ్లోబల్ లీడర్స్ 1994 బాబితాలో అల్ఫోన్స్ కన్నన్‌తనంకు చోటుదక్కింది. 2006లో కేరళ అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. 
 
హర్దీప్ సింగ్ పూరీ: పంజాబ్‌కు చెందిన మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన హర్‌దీప్‌ సింగ్‌కు విదేశాంగ వ్యవహారాలపై మంచి పట్టుంది. ప్రస్తుతం ఆయన అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన ఆర్‌ఐఎస్‌ అనే మేధో సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో న్యూయార్క్‌లోని అంతర్జాతీయ శాంతి సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన మాజీ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. విదేశీ విధానాన్ని రూపొందించడంలోనూ... జాతీయ భద్రత విధాన రూపకల్పనలోనూ 40 సంవత్సరాల పాటు విశేష కృషి చేశారు. అలాగే ఐక్యరాజ్య సమితిలో భారత్ రాయబారిగా... ఇంగ్లండ్, బ్రెజిల్‌లోనూ భారత రామబారిగా పని చేశారు. జెనివాలో ఇండియా శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. 
 
 
వీరేంద్ర కుమార్: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. షెడ్యూల్ కుల సమాజిక వర్గానికి చెందిన ఈయన... తికంఘ నియోజక వర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1970లో జయ ప్రకాశ్ నారాయణ నేతృత్వంలో సాగిన సర్వోదయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయి 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఎంఏ ఎకనామిక్స్ చదివిన వీరేంద్ర కుమార్.. బాల కార్మిక వ్యవస్థపై పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం కార్మిక సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడు. గతంలోనూ పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తర కొరియా అణు పరీక్ష.. 5.1 తీవ్రతతో భూప్రకంపనలు