Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వినాయక చవితి పండుగ పూట ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

modi - parliament
, సోమవారం, 18 సెప్టెంబరు 2023 (12:13 IST)
వినాయక చవితి పండుగ పూట పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌ ముందు మీడియాతో మాట్లాడారు. భారత్‌ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ భవిష్యత్తుకు భారత్‌ ఆశాకిరణంగా మారిందని ప్రధాని అన్నారు. ఇక, ఈ ప్రత్యేక సమావేశాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోనున్నట్లు మోడీ వెల్లడించారు.
 
'ఉజ్వల భవిష్యత్తు దిశగా భారత్‌ పయనిస్తోంది. కొత్త సంకల్పం దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేయాలి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుంది. దేశవ్యాప్తంగా సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది. దేశాభివృద్ధి నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఈ ప్రత్యేక సమావేశాల నిడివి తక్కువే అయినప్పటికీ.. జరుగుతున్న సందర్భం చాలా గొప్పది. ఇందులో చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నాం' అని మోడీ వివరించారు.
 
ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాని విమర్శలు గుప్పించారు. 'ఈ సమావేశాలు చాలా ముఖ్యమైనవి. పార్లమెంట్‌ సభ్యులంతా దీనికి హాజరుకావాలని కోరుకుంటున్నా. ఏడుపులు, విమర్శలకు ఇది సమయం కాదు. విశ్వాసం, సానుకూల దృక్పథంతో వీటిని నిర్వహించుకుందాం. సభ్యులంతా ఉత్సాహంగా చర్చల్లో పాల్గొంటారని ఆశిస్తున్నా' అని మోడీ అన్నారు. 
 
అలాగే, చంద్రయాన్‌-3, జీ20 సదస్సు విజయం గురించి కూడా ప్రధాని మోడీ ప్రస్తావించారు. 'జాబిల్లిపై మన మిషన్‌ విజయవంతమైంది. చంద్రయాన్‌-3తో మన జెండా సగర్వంగా రెపరెపలాడింది. శివశక్తి పాయింట్‌ నవ శకానికి స్ఫూర్తి కేంద్రంగా మారింది. ఇలాంటి విజయాలు సాధించినప్పుడే శాస్త్ర, సాంకేతికతలో మనమెంత ముందున్నామో ప్రపంచానికి తెలుస్తుంది. ఈ విజయంతో అనేక అవకాశాలు భారత్‌ తలుపులు తడుతాయి. జీ20 సదస్సు అద్భుతంగా జరిగింది. భారత ఉజ్వల భవిష్యత్తుకు ఈ సదస్సు మార్గదర్శనం చేసింది. జీ20 సదస్సుల్లో మన ప్రతిపాదనలను అన్ని దేశాలు ఆమోదించాయి. ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం దక్కింది' అని మోడీ ఆనందం వ్యక్తం చేశారు.
 
మరోవైపు, పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో స్పీకర్‌ వారిని వారించారు. అనంతరం జీ20 సదస్సు విజయవంతమవడంపై స్పీకర్‌ అభినందనలు తెలియజేశారు. అయితే, లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో స్పీకర్‌ వారిని వారించారు. అనంతరం జీ20 సదస్సు విజయవంతమవడంపై స్పీకర్‌ అభినందనలు తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమార్తెకు బర్త్‌డే గిఫ్ట్... చందమామపై ఎకరా భూమి కొనిచ్చిన తండ్రి!