టపాసుల నిషేధానికి మతం రంగు పులమొద్దు : సుప్రీంకోర్టు
ఢిల్లీలో టపాసుల నిషేధాన్ని ఎత్తివేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నవంబర్ 1వ తేదీ వరకు ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో టపాసులపై నిషేధం అమల్లో ఉంటుందని కోర్టు తేల్చిచెప్పింది.
ఢిల్లీలో టపాసుల నిషేధాన్ని ఎత్తివేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నవంబర్ 1వ తేదీ వరకు ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో టపాసులపై నిషేధం అమల్లో ఉంటుందని కోర్టు తేల్చిచెప్పింది. టపాసుల నిషేధానికి మతం రంగు పులమడం తమను బాధ కలిగించిందని కోర్టు వ్యాఖ్యానించింది. దీపావళి పర్వదినం సందర్భంగా టపాసులు కాల్చడంపై ఢిల్లీలో కాలుష్యం ఎక్కువైపోతుందని కోర్టు తెలిపిన విషయం విదితమే.
ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతాల్లో టపాసుల అమ్మకంపై నిషేధం విధిస్తూ గతేడాది సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన విషయం విదితమే. నిషేధాన్ని సడలించాలని లేనిపక్షంలో ఆంక్షలు తగ్గించాలని వ్యాపారులు రివ్యూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది.
దీనిపై స్పందించిన కోర్టు.. ఈ వ్యాఖ్యలు చేసింది. హిందూ పండుగ మనోభావాలను దెబ్బతీస్తున్నారని భావించొద్దని.. ఇది బాధాకరమే అయినా పర్యావరణ పరిరక్షణ అనేది అంత కంటే ముఖ్యం అని వ్యాఖ్యానించింది. తీర్పుకు మతం రంగు వేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబర్ ఒకటో తేదీ వరకు బాణాసంచా అమ్మకాలపై నిషేధం కొనసాగుతుందని మళ్లీ స్పష్టం చేసింది. తీర్పులో ఎలాంటి మార్పు ఉండదని తేల్చి చెప్పింది.