దేశంలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పక్షులు మరణించడం కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్, ఒడిశా, యూపీలో పక్షులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని నీముచ్, ఇందోర్ మార్కెట్లలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయని రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టర్ వెల్లడించారు. ఇప్పటివరకు ఎనిమిది జిల్లాల్లో బర్డ్ ఫ్లూను గుర్తించామని స్పష్టం చేశారు.
మరోవైపు, రాజస్థాన్ జోధ్‌పుర్ జిల్లాలోని సెత్రావా, ఫలోదీ ప్రాంతాల్లో యాభై కాకులు మృత్యువాత పడ్డాయి. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో.. మరణించిన కాకుల నమూనాలను పరీక్షల కోసం పంపించారు అధికారులు.
అనంతరం కాకుల మృతదేహాలను ఖననం చేసినట్లు తెలిపారు. ఫలోదీ సరస్సు వద్ద ఇదివరకే పదుల సంఖ్యలో కాకులు మరణించాయని అధికారులు వెల్లడించారు. జోధ్‌పుర్ నుంచి పంపిన నమూనాల్లో బర్డ్ ఫ్లూ లేదని స్పష్టం చేశారు.
అలాగే జమ్మూకాశ్మీరులో 150 కాకులు మృతిచెందడంతో ప్రజల్లో బర్డ్ ఫ్లూ భయం ఏర్పడింది. జమ్మూకాశ్మీరులోని ఉధంపూర్, కథువా, రాజౌరి జిల్లాల్లో 150 కి పైగా కాకులు మరణించాయి.