దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కేజ్రీవాల్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఇప్పటికే సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించింది.
ఇంకవైపు, ఈ వ్యవహారంలో కేంద్రంపై కేజ్రీవాల్ సాగిస్తోన్న పోరు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది. ఆర్డినెన్స్‌కు మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. విపక్షాల భేటీకి ఒకరోజు ముందు ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.
కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ బహిరంగంగా వ్యతిరేకించాలని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. తన నిర్ణయాన్ని తెలపాలంటూ పాట్నాలో జరిగిన విపక్షాల భేటీకి ముందు అల్టిమేటం కూడా జారీ చేసింది.
అయినప్పటికీ.. కాంగ్రెస్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో.. కాంగ్రెస్ తన వైఖరిని బయటపెట్టేంత వరకు భవిష్యత్తులో జరగబోయే ప్రతిపక్షాల సమావేశాలకు హాజరయ్యేదే లేదని ఆప్ తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో తదుపరి సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ సమయంలో చెప్పారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఆదివారం స్పందించింది. 'ఆర్డినెన్స్ విషయంలో మాది స్పష్టమైన నిర్ణయమే. దానికి మద్దతు ఇవ్వడం లేదు. త్వరలో బెంగళూరులో జరగనున్న విపక్షాల భేటీకి ఆప్ హాజరవుతుందని భావిస్తున్నాం' అని కాంగ్రెస్ ప్రతినిధి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇది సానుకూల పరిణామమని ఆప్ స్పందించింది.