Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను లేకుండా చేస్తాం: వరంగల్ సభలో ప్రధాని మోదీ

Advertiesment
Modi
, శనివారం, 8 జులై 2023 (17:49 IST)
‘జై మా భద్రకాళి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. "భద్రకాళి అమ్మవారి మహాత్మ్యానికి, సమ్మక్క సారలమ్మ పౌరుషానికి, రాణి రుద్రమ పరాక్రమానికి ప్రఖ్యాతిగాంచిన వరంగల్‌కు రావడం సంతోషంగా ఉంది" అంటూ ఆయన తన ప్రసంగం కొనసాగించారు. తెలంగాణ అభివృద్ధికి తొమ్మిదేళ్లుగా తోడ్పడుతున్నామని ప్రధాని చెప్పారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఈ బహిరంగ సభ జరిగింది.
 
"ప్రస్తుతం తెలంగాణలో 36 వేల కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయి. ఇక్కడి రైల్వే ప్రాజెక్టులకు గతం కంటే ఎన్నో రెట్లు నిధులిచ్చాం. ఇక్కడ త్వరలో వ్యాగన్లు తయారు కానున్నాయి. భారతదేశ ఆత్మనిర్భర్‌లో తెలంగాణ పాత్ర ఎంతో ఉంది. కోవిడ్ సమయంలో తెలంగాణ నుంచి వ్యాక్సీన్ అందింది" అని మోదీ ప్రస్తావించారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను లేకుండా చేస్తామని ఆయన చెప్పారు.
 
‘‘తెలంగాణలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం రోజంతా నాలుగే నాలుగు పనులు చేస్తోంది. మొదటిది- మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని రెగ్యులర్‌గా తిట్టడం. వీళ్ల డిక్షనరీ మొత్తం ఇదే. ఇక రెండోది.. ఒకే కుటుంబాన్ని అధికార కేంద్రంగా మార్చడం. సొంత కుటుంబాన్ని తెలంగాణకు యజమానిగా చేయడం. మూడోది.. తెలంగాణ ఆర్థిక వికాసాన్ని నాశనం చేయడం. నాలుగోది.. తెలంగాణను అవినీతిలో ముంచేయడం. అందరికంటే అత్యధిక అవినీతి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే. ఈయన అవినీతి దిల్లీ వరకు పాకింది" అని మోదీ ఆరోపించారు.
 
‘‘తెలంగాణ కోసం ప్రజలు ఎంతగానో పోరాడారు. బలిదానాలు చేశారు. కానీ, ఇలాంటి రోజు చూడాల్సిన ఖర్మ పట్టింది తెలంగాణ ప్రజలకు. ఇలాంటి అవినీతి కుటుంబం చేతిలో తెలంగాణ చిక్కుకుంటుందని మీరు ఎఫ్పుడు అనుకుని ఉండరు. తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు మరోవిషయం గుర్తించాలి. ఈ కుటుంబ పాలకులంతా అవినీతిపరులే. కుటుంబ పాలకులైన కాంగ్రెస్ అవినీతి దేశమంతా చూసింది. కుటుంబ పాలకులైన కేసీఆర్ పాలనను తెలంగాణ చూసింది. ఈ రెండు కుటుంబాలూ తెలంగాణ ద్రోహులు’’ అని మోదీ విమర్శించారు.
 
“తెలంగాణలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు మర్చిపోలేం. ఉద్యోగాలిస్తామన్నారు. అదీ ఇదీ అన్నారు. అన్నీ మర్చిపోయారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కుంభకోణం గురించి అందరికీ తెలుసు. 9 ఏళ్లుగా ఇక్కడి నిరుద్యోగులు నిరీక్షిస్తుంటే ఈ ప్రభుత్వం ఆ పార్టీ నేతల మనుషులకు ఉద్యోగాలిచ్చేలా ప్లాన్ చేసింది. లక్షల మంది యువత కలలను భగ్నం చేసింది’’ అని ఆయన ఆరోపించారు. తెలంగాణలోని యూనివర్సిటీల్లో 3 వేలకు పైగా ఖాళీలున్నాయని, స్కూళ్లలో 15 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మోదీ చెప్పారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని ఇవ్వలేదని, రుణ మాఫీ చేస్తామని చేయలేదని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆయన విమర్శించారు.
 
‘‘మేం అలా కాదు. గ్రామీణ ప్రజల ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టాం. కనీస మద్దతు ధర పెంచుతామన్నాం. పెంచాం. దేశవ్యాప్తంగా ఏడు మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేస్తుంటే, అందులో ఒకటి తెలంగాణలో ఉంది. తెలంగాణ పంచాయతీలకు కేంద్రం నుంచి నేరుగా నిధులిచ్చాం. ఏకలవ్య మోడల్ స్కూళ్లు ఏర్పాటుచేశాం. ఆయుష్మాన్ భారత్‌తో 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తున్నాం. గత ప్రభుత్వాలు దళితుల పట్ల, గిరిజనుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తే బీజేపీ వారికోసం నిజమైన అభివృద్ధి పనులు చేసింది’’ అని ఆయన చెప్పారు.
 
బీజేపీకి రెండు సీట్లు మాత్రమే ఉన్న కాలంలో కూడా అందులో ఒకటి తెలంగాణ నుంచే ఉండేదని మోదీ తన ప్రసంగంలో గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. మోదీ ఆరోపణలను తెలంగాణ మంత్రి హరీశ్‌రావు తర్వాత ఖండించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కస్టమర్లకు షాక్.. రుణ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్