కేరళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. యువతులు, మహిళలకు వివాహం కాకుండానే వారికి పుట్టిన పిల్లల విషయంలో... సర్టిఫికెట్లలో తండ్రి పేరు బదులు తల్లి పేరు ఉంచేందుకు అనుమతినిచ్చింది. బర్త్, ఆధార్, స్కూల్, క్యాస్ట్, ఓటర్ కార్డులలో ఆ మేరకు మార్పులు చేయాలని ఆదేశించింది.
అవివాహిత మహిళలు, అత్యాచార బాధిత మహిళలకు జన్మించిన పిల్లలకు దేశంలో అందరిలాగే ప్రాథమిక హక్కులైన గోప్యత, స్వేచ్ఛ, గౌరవంతో కూడిన జీవనం అందించాలని పేర్కొంది. అవివాహిత మహిళకు జన్మించిన ఓ వ్యక్తి ఈ మేరకు కోర్టులో కేసు వేశాడు.
తన సర్టిఫికెట్లలో తండ్రి పేరు మూడు రకాలుగా ఉండడంతో వాటిని తొలగించి కేవలం తల్లి పేరు మాత్రమే ఉండేలా అవకాశం కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. విచారించిన కోర్టు అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
తల్లి పేరు నమోదు చేసేలా రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్, బోర్డ్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్స్, యూఐడీఏఐ, పాస్ పోర్టు తదితర విభాగాలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.