Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.10-20కే కిలో ఉల్లి.. ఇద్దరు యువకుల అరెస్ట్

Advertiesment
రూ.10-20కే కిలో ఉల్లి.. ఇద్దరు యువకుల అరెస్ట్
, శుక్రవారం, 27 డిశెంబరు 2019 (08:50 IST)
ఉల్లి ధరల పెంపుపై ఆగ్రహించిన ఇద్దరు యువకులు తీసుకున్న ఓ నిర్ణయం వారిని కటకటాల పాలయ్యేలా చేసింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

పెరుగుతున్న ఉల్లి ధరల కారణంగా సామాన్యులకు ఉల్లి అందుబాటులో లేకుండా పోవడంపై ఆగ్రహం చెందిన అజయ్ జాతవ్, జీతు వాల్మికి.. సమీపంలోని కూరగాయల మార్కెట్‌లోని ఓ గోడౌన్‌ నుంచి ఆరు క్వింటాళ్ల ఉల్లిగడ్డ, మరో క్వింటాల్ ఎల్లిగడ్డ దొంగిలించారు. దొంగిలించిన ఉల్లి గడ్డ, ఎల్లి గడ్డను మరో చోట బహిరంగ మార్కెట్‌లో రూ.10-20లకే విక్రయించారు.

తద్వారా సామాన్యులకు కారుచౌకగా ఉల్లి అందించేలా చేస్తున్నామనే భావించారు కానీ తాము చేస్తోంది నేరం అని తెలుసుకోలేకపోయారు. ఇదిలాఉండగా.. మార్కెట్‌లో ఉల్లి గడ్డ, ఎల్లి గడ్డ చోరీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఉండగానే ఇద్దరు యువకులు ఇలా తక్కువ ధరకే ఉల్లిని విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు అనుమానంతో వారిని అరెస్ట్ చేశారు.

రూ.100 కాస్త అటు ఇటుగా అమ్ముడవుతున్న ఉల్లిగడ్డను రూ.10-20కే ఎలా విక్రయిస్తున్నారని ప్రశ్నించగా యువకులు తమ నేరాన్ని అంగీకరించారు. ఉల్లి ధరలు పెరుగుతున్న వైనం తమను తీవ్ర అసంతృప్తికి, ఆవేదనకు గురిచేసిందని.. అందుకే అలా ఉల్లిని దొంగిలించి తక్కువ ధరకే విక్రయించామని వివరించారు.
 
ఈ ఘటనపై జనక్‌గంజ్ పోలీసు స్టేషన్ హౌజ్ ఇంచార్జ్ ప్రీతీ భార్గవ్ మాట్లాడుతూ.. యువకులు దొంగిలించిన సొత్తు విలువ రూ.60,000 విలువ చేస్తుందని తెలిపారు. ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్టు ప్రీతి భార్గవ్ వెల్లడించారు.
 
ఉల్లికి.. వెల్లుల్లి తోడైంది
మొన్నటి వరకూ ఉల్లి హడలెత్తిస్తే.. ఇప్పుడు వెల్లుల్లి ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. మూడునెలలతో పోలిస్తే వెల్లుల్లి గడ్డ ధర ఏకంగా 250 రూపాయలకు చేరింది. ఉల్లి, వెల్లుల్లి ధరలు పెరిగిపోవడంతో వంట ఎలా చేసుకోవాలో తెలియక పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంతలా ధరలు పెరగడం ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు చెబుతున్నారు.
 
నిన్నటి వరకూ ఉల్లి ధర పేలిపోయింది. కోయడం కాదు కదా ముట్టుకోవాలంటే జనం భయపడే పరిస్థితి వచ్చింది. దాదాపు రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో జనం అల్లాడిపోయారు. ప్రభుత్వ ఈజిప్టు నుంచి ఉల్లిదిగుమతులు చేసుకుని..వాటిని రాయితీపై అందించే వరకూ ఉల్లి రెండువందల రూపాయలే పలికింది. ఇప్పుడిప్పుడే ఉల్లి ధర దిగివస్తోంది. ఇలాంటి సమయంలో వెల్లుల్లి .. ఒక్కసారిగా విశ్వరూపాన్ని చూపిస్తోంది. ధర కొండెక్కి కూర్చుంది.
 
ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెల్లుల్లి రెండు వందల పైచిలుకు పలుకుతోంది. ఇది కూడా హోల్ సేల్ మార్కెట్లో ఈ ధరకు లభిస్తోంది. ఇక రిటైల్ మార్కెట్‌లో నైతే... ఏకంగా 250 పైనే ధర ఉంది. ఉల్లి తరహాలో ప్రభుత్వం వెల్లుల్లి గడ్డలను కొనుగోలు చేసి.. రాయితీపై అందించాలని జనం కోరుతున్నారు.
 
సాధారణంగా శీతాకాలంలో వెల్లుల్లి ధరలు కాస్త పెరగడం కామన్‌. కానీ ఈ స్థాయిలో పెరగడం ఎప్పుడూ చూడలేదని వ్యాపారస్థులు చెబుతున్నారు. ధరలు అధికంగా ఉండటంతో .. వ్యాపారం పడిపోయిందంటున్నారు. దీనికి తోడు రైతుల దగ్గర నుండి సరుకు మార్కెట్ కు రాకముందే దళారులు పక్కదారి పట్టిస్తున్నారని చెబుతున్నారు.

ప్రధానంగా వెల్లుల్లి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ లో కురిసిన అకాల వర్షాలతో పంట దిగుబడి కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో వెల్లుల్లి ధర కొండె క్కింది. నేషనల్‌ హార్టికల్చర్‌ బోర్డ్‌ గణాంకాల ప్రకారం వెల్లుల్లి ధరలు ఢిల్లీలో అత్యధికంగా 55శాతం పెరిగాయి.
 
ముంబయిలోని రిటైల్‌ మార్కెట్లో కిలో వెల్లుల్లి రూ.250 రూపాయలకు ఎగబాకింది. గతనెలతో పోలిస్తే 100 శాతం పెరిగింది. కొన్ని వారాలుగా మహారాష్ట్ర, గుజరాత్‌ మార్కెట్లతో పాటు దక్షిణాది రాష్ట్రాల మార్కెట్లకు సరఫరా తగ్గడంతో ఉన్నపలంగా డిమాండ్‌ బాగా పెరిగింది. ముంబయి హౌల్‌సేల్‌ మార్కెట్‌కు 112 టన్నుల వెల్లుల్లి అవసరం కాగా.. 64 టన్నుల వరకూ వస్తున్నట్లు తెలుస్తోంది.

బెంగళూరు మార్కెట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉల్లి, వెల్లుల్లి ధరలు పెరిగిపోయి.. తమ జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని .. పేద, సామాన్యతరగతి ప్రజలు వాపోతున్నారు.పెరిగిన ధరలను ప్రభుత్వమే భరించి.. రాయితీపై అందించాలని కోరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుట్కా వ్యాపారం గుట్టు రట్టు.. లక్షల విలువైన గుట్కా స్వాధీనం