దేశంలో మరో విధానం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. వన్ నేషన్ .. వనే పర్మిట్ విధానాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఈ విధానం కింద రాష్ట్రాలు మారినప్పుడు కూడా ఎలాంటి ఫీజులు చెల్లించకుండానే వ్యక్తిగత వాహనాల్లో దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించవచ్చు.
వన్ నేషన్-వన్ పర్మిట్ విధానంలో భాగంగా ఆలిండియా టూరిస్ట్ వెహికిల్స్ పర్మిట్ - 2021 మార్గదర్శకాలను కేంద్రం రూపొందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి వాటిని అమలుచేయాలని నిర్ణయించింది.
దీంతో అంతరాష్ట్ర రాకపోకలు సాగించే క్యాబ్‌ల నుంచి బస్సుల వరకు ఒకే పర్మిట్ వర్తిస్తుంది. రాష్ట్రాలు మారినప్పుడల్లా ఫీజు చెల్లించకుండా వెసులుబాటు ఉంటుందని మార్గదర్శకాల్లో పేర్కొంది.
పర్యాటక పర్మిట్ ఫీజులను ఖరారు చేశారు. ఒక్కసారి ఫీజు చెల్లిస్తే ఏడాదిపాటు వాహనాల్లో తిరగొచ్చు. 9 సీట్ల లోపు సామర్థ్యమున్న నాన్ ఏసీ వాహనాలకు రూ.15 వేలు, ఏసీ వాహనమైతే రూ.25 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
23 సీట్ల కంటే తక్కువ ఉన్న మినీ బస్సులు, ఇతర వాహనాలు నాన్ ఏసీ అయితే ఏడాదికి రూ.50 వేలు, ఏసీ అయితే రూ.75 వేలు చెల్లించాలి. 23 సీట్లకంటే ఎక్కువ ఉన్న నాన్ ఏసీ బస్సులైతే టూరిస్ట్ పర్మిట్ కోసం ఏడాదికి రూ.2 లక్షలు, ఏసీ బస్సు అయితే రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, టోల్ రుసుముల్లోఎలాంటి మార్పు ఉండదు. టూరిస్ట్ పర్మిట్ తీసుకున్న వాహనాలూ టోల్ ఫీజుతో పాటు ఇతర చార్జీలను చెల్లించాలని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. తాజా విధానం ద్వారా వ్యక్తిగత వాహనదారులు కూడా ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక పర్మిట్లు అవసరం లేకుండా ప్రయాణించే సౌలభ్యం ఏర్పడింది.
ఇప్పటివరకు ప్రయాణీకుల రవాణా సౌకర్యార్థం వివిధ రాష్ట్రాల్లో యెల్లో నంబర్ ప్లేట్‌ను వాహనంపై అనుమతిచ్చేవారు. క్యాబ్‌లు, ఆటోలు, బస్సులకు కూడా ఇదే విధానం అమల్లో ఉండేది. యెల్లో నెంబర్ ప్లేట్ ఉన్న వాహన యజమానికి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. వాహనానికి సంబంధించి అదనంగా తైమ్రాసిక పన్నులు, రోడ్డు ట్యాక్సులు, ఫిట్‌నెస్ టెస్ట్‌లు ఉంటాయి. ఫిట్‌నెస్ అనేది ప్రయాణీకుల భద్రతకు ఎంతో కీలకమైన అంశం.