Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేంద్రం కీలక నిర్ణయం : జమిలి ఎన్నికలకు మోడీ మంత్రివర్గం సై!

vote

ఠాగూర్

, బుధవారం, 18 సెప్టెంబరు 2024 (16:51 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ నినాదం మేరకు దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రూపొందించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. వచ్చే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులతో సహా 32 పార్టీలు ప్రముఖ న్యాయమూర్తులు దీనిని సమర్థించారు. 18 రాజ్యాంగ సవరణలను ప్యానల్‌ సిఫార్సు చేసింది. 
 
"ఒక దేశం, ఒకే ఎన్నికలు" విధానాన్ని అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ సులభతరమవుతుందని, తద్వారా వేగవంతమైన ఆర్థికవృద్ధికి దారితీస్తుందని ప్యానల్‌ పేర్కొంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, పంచాయతీలకు మూడు స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల వలస కార్మికులు పలుమార్లు ఓటేయడం కోసం సెలవులపై తమ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని.. దీనివల్ల ఉత్పత్తిలో అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. దానిని నివారించాలంటే జమిలి ఎన్నికలే ఏకైక పరిష్కారమని కమిటీ అభిప్రాయపడింది. 
 
ప్రస్తుత ఎన్డీయే సర్కారు హయాంలోనే జమిలి ఎన్నికలు అమలుచేసి చూపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇటీవల స్పష్టం చేసిన విషయం తెల్సిందే. గతనెల స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా యేటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని, వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. 
 
దీని నుంచి బయటపడాలంటే జమిలి ఎన్నికలే పరిష్కారమన్నారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ 3.0 సర్కారులోనే జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కాంగ్రెస్‌ పార్టీతో సహా 15 పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. ఈ ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని కాంగ్రెస్ పేర్కొంది. పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ 'ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం. దీనిని ప్రజలు అంగీకరించరు' అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరంగల్‌లో పెరుగుతున్న వైరల్ ఫీవర్లు, డెంగ్యూ కేసులు