కరోనా బాధిత రాష్ట్రాలకు ఒడిషా ప్రాణవాయువును సరఫరా చేస్తోంది. బాధిత రాష్ట్రాలకు భారీ మొత్తంలో ఆక్సిజన్ అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వెల్లడించారు. ఇందులోభగాంగా, కరోనా బాధిత రాష్ట్రాలకు ఒడిశా శనివారం 200 టన్నుల ఆక్సిజన్‌ను పంపింది.
ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హామీ ఇచ్చిన మరునాడే ఆక్సిజన్ ట్యాంకర్లను పంపడం గమనార్హం.
విశాఖపట్టణం, హైదరాబాద్, ఇండోర్, పూణె, ముంబై, నాగ్‌పూర్ తదితర నగరాలకు ట్యాంకర్లు ఇప్పటికే బయలుదేరాయి. మరికొన్ని ట్యాంకర్లు మరిన్ని నగరాలకు బయలుదేరనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కొన్ని ట్యాంకర్లను భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి వాయుమార్గం ద్వారా తరలించినట్టు ప్రభుత్వం తెలిపింది.
మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లను ఇతర రాష్ట్రాలకు తరలించే క్రమంలో ఎలాంటి జాప్యం జరగకుండా ఒడిశా పోలీసులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్టు డీజీపీ ట్వీట్ చేశారు. ట్రాఫిక్ సాఫీగా సాగిపోయేందుకు సీనియర్ పోలీసు అధికారులు, ఆయా జిల్లాల ఎస్పీలు ప్రత్యేక చర్యలు చేపట్టారని, వాటికోసం ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేశారని, పోలీస్ ఎస్కార్ట్ కూడా అందించినట్టు తెలిపారు.
ఇదిలావుండగా, ప్రస్తుతం యుద్ధం తరహా వాతావరణం నెలకొందని, జాతీయ స్థాయిలో ఆక్సిజన్ సహా ఇతరత్రా సాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ నెల 22న ట్వీట్ చేశారు. అనుకున్నట్టే ఇప్పుడు కొవిడ్ బాధిత రాష్ట్రాలకు టన్నుల కొద్దీ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారు.
మరోవైపు, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాలు కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్నాయి. సరిపడా ఆక్సిజన్ లేకపోవడంతో చికిత్సకు ఆటంకం ఏర్పడుతోంది. ఫలితంగా కరోనా రోగులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు. అంతేకాదు, తమ వద్ద ఆక్సిజన్ లేదని, కాబట్టి తామేమీ చేయలేమని పలు ఆసుపత్రులు చేతులెత్తేస్తున్నాయి.