Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అధ్యక్షుడు కాకముందే కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన అశోక్ గెహ్లాట్

ashok gehlot
, సోమవారం, 26 సెప్టెంబరు 2022 (10:11 IST)
రాజస్థాన్ రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేయాలని పార్టీ అధిష్ఠానం భావించింది. కానీ, ఆ పదవిపై ఏమాత్రం ఇష్టంలేని అశోక్ గెహ్లాట్.. పెద్దల మాటకు తలాడించారు. కానీ, రాష్ట్రంలో తాను చేయదలచిన పనిని గుట్టు చప్పుడుకాకుండా చేశారు. తన వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు. తద్వారా తాను చెప్పిన వ్యక్తినే తదుపరి సీఎం చేయాలని పరోక్షంగా కండిషన్ పెట్టారు. దీంతో ఆ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 
 
అక్టోబరు 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష పదవి రేసులో అశోక్ గెహ్లాట్ ముందు వరుసలో ఉన్నారు. ఆయనే తదుపరి కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడని ప్రచారం జరుగుతోంది. అయితే తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతానని గెహ్లాట్ సోనియా, రాహుల్‌కు చెప్పగా వారు తిరస్కరించారు. ఒక వ్యక్తికి ఒకే పదవి ఫార్ములా ఫాలో కావాలని సూచించారు. అయితే కనీసం స్పీకర్ సీపీ జోషిని సీఎం చేయాలని గెహ్లాట్ అడిగారు. 
 
తన రాజకీయ ప్రత్యర్ధి సచిన్ పైలట్‌ను మాత్రం సీఎం చేయడానికి వీల్లేదని మోకాలడ్డారు. కేరళ నుంచి జైపూర్ చేరుకోగానే వేగంగా పావులు కదిపారు. తన వర్గం ఎమ్మెల్యేలను తన వైపే ఉండేలా చూసుకున్నారు. తనకు మద్దతుగా 92 మంది ఎమ్మెల్యేల చేత గెహ్లాట్ రాజీనామా చేయించారు. 
 
గెహ్లాట్‌కు మద్దతుగా రాజీనామా చేసిన వారి సంఖ్య వంద దాకా ఉందని తెలుస్తోంది. రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు జైపూర్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కూడా ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ప్రస్తుతం చేతులెత్తేశారు. 
 
మొత్తానికి ఇంకా అధ్యక్షుడు కాకముందే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి గెహ్లాట్ షాకివ్వడం కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరనేదానికన్నా రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయమే ప్రస్తుతం హైలైట్ అవుతుండటం కొసమెరుపు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలిసినవారే కదాని వెంటపోతే మద్యం తాపించి అత్యాచారం చేశారు...