కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ ఆస్పత్రి జూనియర్ మహిళా వైద్యురాలి హత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు రేఖా శర్మ స్పందించారు. ఈ ఘటనలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది ఒక్క వ్యక్తి చేసిన పని కాదని అర్థమవుతోందన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారిని రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విషయం స్పష్టంగా తెలుస్తుందని, ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు.
'ఇది చాలా విషాదకర సంఘటన. ఒక మహిళ తన కార్యాలయంలో సురక్షితంగా లేకుంటే, ఇంకెక్కడ రక్షణ ఉంటుంది? ఈ ఘోరాన్ని చూస్తే ఒకరు చేసిన పనిలా అనిపించట్లేదు. కేసులోని ఇతర నిందితులను రక్షించడానికి సాక్షాత్ ఆ రాష్ట్ర మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. పోలీసుల తీరుపైనా అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం దీనిపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. సీఎం దాచాలని చూస్తున్న విషయాలన్నీ అందులో బయటపడతాయి' అని పేర్కొన్నారు.
ఇటీవల ఈ ఘనటకు సంబంధించిన విషయంలో రేఖాశర్మ మాట్లాడుతూ పనిప్రదేశాల్లో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విఫలమయ్యిందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చెలరేగులున్న నేపథ్యంలో హత్యాచారం జరిగిన ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో బుధవారం అర్థరాత్రి దుండగులు విధ్వంసం సృష్టించారు. ఆధారాలను నాశనం చేసేందుకు ఆ మూక ప్రయత్నించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి దాడులు పునరావృతం అవ్వకుండా ఆసుపత్రి వద్ద ఆదివారం ఆంక్షలు విధించారు. మరో ఏడు రోజుల పాటు ఇవి అమల్లో ఉంటాయని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.