భారత్‌లోకి చొరబడేందుకు జమ్ముూ-కాశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి సుమారు 200 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నారని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. ఆరు ప్రధాన ఉగ్రవాద శిబిరాలు, 29 మైనర్ క్యాంపులు, వివిధ సైనిక స్థావరాలకు సమీపంలో తాత్కాలిక ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్‌లు ఉన్నాయని చెప్పారు.
పాకిస్థాన్ ఆర్మీ ఉగ్రవాదులకు మౌలిక వసతులు కల్పిస్తుందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న అంశాన్ని తోసిపుచ్చలేమన్నారు.
కాగా, ఉగ్రవాదుల చొరబాట్లను ధీటుగా తిప్పికొడతామని ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. దీని కోసం రెండంచుల రక్షణగా రిజర్వ్ బలగాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.
మరోవైపు 2021 ఫిబ్రవరిలో జరిగిన ఒప్పందం మేరకు భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విమరణ బాగానే కొనసాగుతుందని జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. గత 12 నెలల్లో చాలా తక్కువగా కాల్పుల విమరణ ఉల్లంఘన జరిగిందని, ఒకటి నుంచి మూడు సార్లు జరిగి ఉండవచ్చని అన్నారు.