Clarity on Retirement Age కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుపై కేంద్ర ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసులో మార్పులు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై కేంద్రం ఓ స్పష్టత నిచ్చింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును మార్చే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
లోక్‌సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం 60 ఏళ్లు నిండిన తర్వాత పదవీ విరమణ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే, యువతకు ఉపాధి కల్పించే విధానాలు, కార్యక్రమాలను రూపొందించడంలో ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని మంత్రి తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులను సమయానుకూలంగా భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నామన్నారు.
రోజ్‌గార్ మేళాల ద్వారా అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, విద్యా, ఆరోగ్య రంగాల్లోని సంస్థల్లో మిషన్ మోడ్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు మంత్రి వివరించారు.