బీహార్ రాష్ట్రంలో నితీశ్ కుమార్ సారథ్యంలో 10.0 సర్కారు కొలువుదీరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వంటి రాజకీయ దిగ్గజాలు హాజరుకాగా ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ పదో సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారం వేడుక భారీ ఎత్తున జరిగింది.
కాగా, బుధవారం జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతగా నీతీశ్‌ను ఎన్నుకున్నారు. తాను ఎన్నిక కాగానే సీనియర్ నేతలు వెంటరాగా నీతీశ్.. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌ఖాన్ వద్దకు వెళ్లి, రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. కాగా, మొత్తం 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్ శాసనసభకు ఇటీవల రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఏకంగా 202 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెల్సిందే.