కేరళ రాష్ట్రంలోని కోళికోడ్‌లో రెండు అసహజ మరణాలు సంభవించాయి. దీంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నీపా వైరస్ కారణంగా ఇద్దరు బాధితులు మరణించారంటూ ప్రచారం సాగుతుంది. దీంతో ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ సోమవారం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. కోళికోడ్ రాష్ట్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ మరణాలు సంభవించినట్టు ప్రభుత్వం పేర్కొంటుంది. మృతుల బంధువు ఒకరు అనారోగ్యం కారణంగా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టుగా కూడా వెల్లడించింది. దక్షిణ భారతంలో తొలి నిపా వైరస్ కేసు 2018లో కోజీకోడ్ జిల్లాలోనే బయటపడింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, జంతువుల ద్వారా మనుషులకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం లేదా వ్యాధి బారినపడ్డ వారి సమీపంలోకి వెళితే ఇన్ఫెక్షన్ బారిన పడతారు. నీపా వైరస్ రోగుల్లో కొందరికి ఎటువంటి లక్షణాలు ఉండవు. మరికొందరిలో మాత్రం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కనిపిస్తే, ఇంకొందరు ప్రాణాంతకమైన మెదడువాపు బారినపడతారు. పందుల వంటి జంతువులకూ సోకే నీపా వైరస్ రైతులకు భారీ ఆర్థికనష్టం జరుగుతుందని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.