దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు పూనుకుంటోంది. ఈ క్రమంలో వివాహ వేడుకలకు 50 మంది మాత్రమే హాజరయ్యే విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలో 200గా ఉన్న సంఖ్యను 50కి కుదించింది.
ఢిల్లీలో కరోనా పరిస్థితిపై సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. వైరస్ హాట్‌స్పాట్లుగా మారుతున్న మార్కెట్లను మూసివేయనున్నామని, పెళ్లిళ్లు, ఇతరత్రా వేడుకలకు హాజరయ్యే వారి సంఖ్యను కుదించాలని భావిస్తున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు పంపగా.. బుధవారం ఆయన ఆమోద ముద్ర వేశారు.
అలాగే, లాక్‌డౌన్ విధిస్తారంటూ చక్కర్లు కొడుతున్న ఊహాగానాలను ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆరోగ్య శాఖమంత్రి సత్యేంద్ర జైన్ తోసిపుచ్చారు. దుకాణదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీ వ్యాపారాలు తెరిచే ఉంటాయని భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. కొన్ని నిబంధనలను మాత్రం పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. అది లాక్‌డౌన్ ఏ మాత్రం కాదంటూ సిసోడియా హామీ ఇచ్చారు.