భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే సాధనా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిని ఉద్దేశించి ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ పాలిత యూపీలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, మాయావతి ఆడా కాదు, మగా కాదంటూ వ్యాఖ్యానించారు. తనను ఘోరంగా అవమానించిన పార్టీతోనే ఇప్పుడామె చేతులు కలిపారన్నారు.
1995లో లక్నో గెస్ట్‌హౌస్‌లో తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోయి మరీ ఇప్పుడామె వారితో చేతులు కలిపారని ఆరోపించారు. సాధనా సింగ్ వ్యాఖ్యలపై బీఎస్పీ నేత సతీశ్ మిశ్రా స్పందించారు. ఎస్పీ-బీఎస్పీ పొత్తుతో బీజేపీ నేతలు మతి స్థిమితం కోల్పోయారని విమర్శించారు.
వారిని తక్షణం ఆగ్రా, బరేలీలోని మానసిక వైద్య శాలలో చేర్చాలని సూచించారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ ఎస్పీ-బీఎస్పీ కూటమితో బీజేపీలో వణుకు మొదలైందన్నారు.
కాగా, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు దశాబ్దాలుగా బద్ధశత్రువులుగా ఉన్న ఎస్పీ - బీఎస్పీలు చేతులు కలిపిన విషయం తెల్సిందే. ఈ రెండు పార్టీలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తలా 38 సీట్లలో పోటీ చేయనున్నాయి.