ఛత్తీస్‌గఢ్‌లో జవాన్లను ట్రాప్ చేసి 400 మంది మావోయిస్టులు ఒక్కసారిగా భద్రతా దళాలపై విరుచుకుపడడంతో 24 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న కోబ్రా కమాండర్ రాకేష్ సింగ్ గల్లంతయ్యారు. అయితే ఆయన క్షేమంగా ఉన్నాడని.. తామే కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు మావోయిస్టులు స్థానిక విలేకరులకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది.
జర్నలిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మావోయిస్టుల ఫోన్ కాల్స్‌ని పరిశీలిస్తున్నారు. నిజంగానే రాకేష్ సింగ్ ఆయన వద్ద ఉన్నారా? కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే రాకేష్ సింగ్‌ని కిడ్నాప్ చేశారని తెలియడంతో బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
తన తండ్రి నక్సల్స్ చెరలో బంధీగా ఉన్నాడని తెలిసి ఆయన చిన్నారి కూతురు ఏడుస్తూ మా నాన్నని వదిలేయండి అంటూ విజ్ఞప్తి చేసింది. మా నాన్నను వదిలిపెట్టండి.. అంకుల్ ప్లీజ్.. అంటూ చిన్నారి చెప్పిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి.