Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాబోయే రెండేళ్లలో ప్రతీ ఒక్కరికీ ఇల్లు : ప్రధాని నరేంద్ర మోడీ

Advertiesment
Narendra Modi
, గురువారం, 15 ఆగస్టు 2019 (11:13 IST)
తన భవిష్యత్ గురించి తనకు దిగులు లేదని దేశ భవిష్యత్తే ముఖ్యమన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. 
 
దేశం మారబోతుందన్న భావన అందరిలోనూ ముఖ్యంగా యువతలో ఉందని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో పటిష్టమైన భారత్‌ను నిర్మించాలనే ఆకాంక్షతో లక్ష్యాలు నిర్దేశించుకుంటూ పయనిస్తామని తెలిపారు. ఇప్పటికే అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టినట్లు మోడీ తెలిపారు. 
 
దేశంలో నీటి కొరత ఉందన్న ప్రధాని దాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వందేళ్ల క్రితం చెప్పినట్లు నీళ్లను షాపుల్లో అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగేందుకు నీరు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను తాను చూసినట్లు తెలిపారు. 
 
అందులో భాగంగా సాగు, తాగు నీటి వనరుల కోసం జల్ జీవన్ మిషన్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రూ.3.5 లక్షల కోట్లతో ప్రతీ ఇంటికి నీరందించనున్నట్లు మోడీ తెలిపారు. స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛ్ వాటర్ అందిస్తామన్నారు. ఆధునిక మౌళిక సదుపాయాల కోసం రూ.1000 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
 
గత ప్రభుత్వాలు పేదలను కేవలం ఓటు బ్యాంకుగా పరిగణించాయని వారి అభివృద్ధికి పాటుపడలేదన్నారు. ఇప్పటికీ పేదలకు ఇల్లు, కట్టుకునేందుకు వస్త్రాలు, టాయిలెట్లు కూడా లేని పరిస్థితి ఉందని వారందరి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. 
 
మరోవైపు ఐదేళ్లలో భారత్ ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లు సాధించిందని తెలిపిన మోడీ... 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ప్రజల కోరిక మేరకు ఎయిర్ పోర్టులు, ఫైవ్ స్టార్ రైల్వే స్టేషన్లు కూడా మరిన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. 
 
ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌ను ఒడిసి పట్టుకున్నట్లు స్పష్టం చేశారు. దేశంలోని ప్రతీ జిల్లా ఎగుమతి కేంద్రంగా తయారుకావాల్సిన అవసరం ఉందని మోడీ ఆకాంక్షించారు. దేశం పర్యాటకులకు స్వర్గధామం కావాలని ప్రధాని మోడీ కోరారు. భారత శక్తి సామర్ధ్యాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నట్లు తెలిపారు. 
 
ఇకపోతే వైద్య ఆరోగ్య రంగాలలో సమూల మార్పులు తీసుకువచ్చామని, ఎన్నో సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ఆయుస్మాన్ భారత్ దేశప్రజలకు ఒక వరమంటూ కొనియాడారు. వైద్యాన్ని ప్రతీ సామాన్యుడికి అందుబాటులోకి తేవాలన్నదే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ప్రతీ ఒక్కరికి ఇల్లు ఉండాలన్నదే తన సంకల్పం అంటూ మోడీ చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త రూల్.. ఫుడ్‌ ప్యాకెట్లపై ఎక్స్​పైరీ డేట్​