ఈ దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తు.చ తప్పకుండా నెరవేర్చుతానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఆయన గురువారం ఉదయం న్యూఢిల్లీలోని ఎర్రకోటపై 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగింస్తూ, భారతావని మారుతోందని, ప్రతి భారత పౌరుడూ దేశాభివృద్ధి నిమిత్తం తనవంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని అన్నారు.
2019 ఎన్నికల తర్వాత ఎర్రకోటపై నుంచి ఇది తన తొలి ప్రసంగమని గుర్తు చేసిన మోడీ, తాను ఇచ్చిన మాటకు తాను కట్టుబడివుంటానని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేసి దేశంలోని ముస్లిం మహిళలందరికీ అండగా నిలిచామని, వారిలో సాధికారతను పెంచామని చెప్పారు. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు మెరుగైన చట్టాలను తెచ్చామని గుర్తు చేశారు.
ఎన్డీయే-2 సర్కారు వచ్చిన 10 వారాల్లోనే దేశ ప్రగతికి, సార్వభౌమత్వానికి ప్రతీకలుగా నిలిచే కీలక నిర్ణయాలను ఎన్నో తీసుకున్నామని, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దు అందులో భాగమేనని నరేంద్ర మోడీ అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆకాంక్షను నెరవేర్చామని చెప్పారు. దీంతో జమ్మూ కాశ్మీర్ ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం లభించిందని, వారిక భారత అభివృద్ధిలో ఓ భాగమని వ్యాఖ్యానించారు.
దేశంలోని రైతులందరికీ పింఛన్ ఇస్తున్నామని, వారు తమ పంటల పెట్టుబడి కోసం ఎదురు చూడాల్సిన పనిలేకుండా సాయం చేయాలని నిర్ణయించామన్నారు. దేశాభివృద్ధి, రక్షణ నిమిత్తం శ్రమిస్తున్న వారందరికీ ప్రణామాలు చేస్తున్నానని, వారి కారణంగానే జాతి పురోగమిస్తుందని అన్నారు.
అంతకుముందు 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా దేశ రాజధానిలో ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ తొలుత అమర వీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించి, ఎర్రకోట వద్దకు రాగా, ఆయనకు త్రివిధ దళాధిపతులు, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వాగతం పలికారు.
ఇదిలావుండగా, వేడుకలు ప్రారంభం కావడానికి కాసేపటి ముందు భారీ వర్షం పడింది. న్యూఢిల్లీలోని రాజ్ కోట పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసినా ఆగస్టు 15 వేడుకలను ప్రత్యక్షంగా తిలకించేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు.
అలాగే, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించడంతో భారీ భద్రతా చర్యలను చేపట్టారు. ఎర్రకోటను నో ఫ్లయ్ జోన్‌గా ప్రకటించిన అధికారులు, ఐదంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, విజయవాడలో ఏపీ గవర్నర్ హరిచందన్‌లు జాతీయ జెండాను ఎగురవేశారు.