భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్.వి.రమణ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఆయనకు గురువారం ఘనంగా సన్మానం చేసింది. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నా విధులను నిర్వర్తించేందుకు సాధ్యమైనంత మేర కృషి చేశా. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పలనకు, జడ్జీల నియామకంపైనే ప్రధానంగా దృష్టిసారించినట్టు చెప్పారు.
లక్ష్యాన్ని సాధించడంలో సాయపడిన తోటి న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. సీజేఐగా తాను ఉన్న పరిధిలో సుప్రీంకోర్టు కొలీజియం వివిధ హైకోర్టులకు 224 మంది న్యాయమూర్తులను నియమించినట్టు తెలిపారు. ఢిల్లీ హైకోర్టుకు జడ్జీల కోసం కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
మరోనైపు, చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేసిన ఘనత జస్టిస్ ఎన్వీ రమణకే దక్కుతుంది. పదవీ విరమణ రోజున ఆయన కీలక తీర్పును వెలువరించారు. రాజకీయ పార్టీల ఉచిత హామీలపై ఇప్పటికే పలు సూచనలు చేసిన జస్టిస్ ఎన్వీ రమణ.. త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.
ఈ త్రిసభ్య ధర్మాసనాన్ని కొత్త సీజేఐ ఉదయ్ ఉమేష్ లలిత్ ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. దీంతో పాటు అఖిలపక్షం, నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాదులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.