Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేత్రదానంపై అపోహలు, తప్పుడు నమ్మకాలు తొలగించాలి: ఉపరాష్ట్రపతి

Advertiesment
నేత్రదానంపై అపోహలు, తప్పుడు నమ్మకాలు తొలగించాలి: ఉపరాష్ట్రపతి
, బుధవారం, 8 సెప్టెంబరు 2021 (08:06 IST)
నేత్రదానం విషయంలో సమాజంలో ఉన్న అపోహలు, తప్పుడు నమ్మకాలను తొలగించాల్సిన అవసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు స్థానిక భాషల్లో భారీ స్థాయిలో మల్టీమీడియా ప్రచారాలను ప్రారంభించాలని సూచించారు.
 
36వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల కార్యక్రమంలో అంతర్జాల వేదిక ద్వారా ప్రసంగించిన ఉపరాష్ట్రపతి, దాత కార్నియా కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారని, అదే సమయంలో దానికి తగిన విధంగా దొరకడం లేదని, రెండింటి మధ్య ఉన్న అంతరాన్ని ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో దాతలు ముందుకు రావడం ద్వారా ఎంతో మంది చూపును పొందగలిగే అవకాశం ఉందని, ఇందు కోసం దాతలు ముందుకు రావాలని, నేత్రదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం అవసరమని సూచించారు.
 
సమాజంలో అక్కడక్కడ పేరుకుపోయిన అపోహలు, నమ్మకాల కారణంగా చాలా మంది మరణించిన తమ కుటుంబ సభ్యుల నేత్రాలను దానం చేయడానికి ముందుకు రావడం లేదని, నేత్రదానం వల్ల మరణించిన వారు మరో జీవితాన్ని కళ్ళ రూపంలో మరో జీవితాన్ని చూడగలరని పేర్కొన్నారు.

సమాజంలో ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయడానికి ముందుకు రావడం ద్వారా, కార్నియా మార్పిడి కోసం ఎదురు చూస్తున్న ఎంతో మందికి మేలు జరుగుతుందని తెలిపారు. అవగాహన, దాత కణజాల ఉత్పత్తిని సులభతరం చేయడం, వాటిని వెంటనే అవసరమైన వారికి అందజేసే చొరవ తీసుకోవడం ద్వారా ఈ అంతరం తగ్గించవచ్చని, ఇందుకోసం ఐ-బ్యాంక్ లు చొరవ తీసుకోవాలని సూచించారు.
 
నలుగురితో కలిసి పంచుకోవడం, నలుగురి క్షేమాన్ని ఆకాంక్షించడం భారతీయుల తత్వమన్న ఉపరాష్ట్రపతి, శిభి చక్రవర్తి, దధీచి మహర్షి తమ అవయవాలను సమాజం కోసం తృణప్రాయంగా దానం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. భారతీయ సమాజం విలువలు, ఆదర్శాలు, సంస్కారాల పునాదులతో నిర్మితమైందన్న ఆయన, ప్రజల్లో స్ఫూర్తిని నింపడానికి, అవయవదానాన్ని ప్రోత్సహించడానికి అలాంటి మహనీయులు జీవితాల గురించి ప్రజలకు తెలియజేసే చొరవ తీసుకోవాలని సూచించారు.
 
అవయవదానం ద్వారా మనిషి జీవితానికి సంతృప్తి దొరకడమే కాకుండా, మరో జీవితాన్ని గడపడం సాధ్యమన్న ఉపరాష్ట్రపతి, వారు చేసే పని మరింత మందిలో స్ఫూర్తిని నింపుతుందన్నారు.

కోవిడ్ మహమ్మారి కారణంగా కార్నియా రిట్రీవల్ పై విధించిన ఆకాంక్షలు, కొరతకు దారి తీశాయన్న ఆయన, ఈ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ప్రత్యామ్నాయ విధానాలను చేపట్టాలని సూచించారు. కోవిడ్ -19 గురించి అవగాహన పెరిగిన నేపథ్యంలో ఐ బ్యాంకింగ్ మరియు టిష్యూ రిట్రీవల్ కు సంబంధించిన మార్గదర్శకాలను సవరించాలని సూచించారు.
 
కంటి శుక్లాలు, గ్లాకోమా లాంటి నేత్ర సంబంధిత సమస్యలకు చికిత్స, కంటి సంరక్షణ చర్యలను బలోపేతం చేసేందుకు బహుముఖ వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి, ఈ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు సమగ్ర కంటి సంరక్షణ సేవలను అందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు పాలు పంచుకోవాలని సూచించారు. ఈ దిశగా నాణ్యమైన చికిత్సను అందించేందుకు ప్రభుత్వరంగ నేత్ర వైద్య శాలలను సరికొత్త సాంకేతికతతో సన్నద్ధం చేయాలని సూచించారు.
 
గత ఐదు దశాబ్ధాలుగా కార్నియా అంధత్వంతో బాధపడుతున్న వేలాది మందికి దృష్టిని బహుమతిగా అందించిన జాతీయ నేత్ర బ్యాంకు బృందానికి ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు.
 
ఈ కార్యక్రమానికి న్యూఢిల్లీ ఎయిమ్స్ సంచాలకు ప్రొ. రణదీప్ గులేరియా, న్యూఢిల్లీ ఎయిమ్స్ ఆప్తాల్మిక్ సైన్సెస్ సెంటర్ చీఫ్ ప్రొ. జీవన్ ఎస్. తితియాల్, జాతీయ నేత్ర బ్యాంక్ కో చైర్ పర్సన్ ప్రొ. రాధిక టాండన్, ఆఫీసర్ ఇన్ ఛార్జ్ ప్రొ. ఎం. వనతి సహా పలువురు దాతల కుటుంబ సభ్యులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు