Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ రాజకీయ బాహుబలికి ఇక తిరుగు ఉందా? సర్వస్వతంత్ర మోదీ ఏం చేయనున్నారు?

ఇప్పుడు నరేంద్రమోదీ అనే వ్యక్తి ఇంటా, బయటా కూడా సర్వస్వతంత్రుడు. ఒక వ్యక్తి ఘనతకు సంబంధించి భాషా నిఘంటువుల్లో ఉన్న అన్ని పదాలూ కలిపితే వాటి ఏకీకృత రూపం నరేంద్రమోదీ. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భా

ఈ రాజకీయ బాహుబలికి ఇక తిరుగు ఉందా? సర్వస్వతంత్ర మోదీ ఏం చేయనున్నారు?
హైదరాబాద్ , ఆదివారం, 12 మార్చి 2017 (04:13 IST)
ఇప్పుడు నరేంద్రమోదీ అనే వ్యక్తి ఇంటా, బయటా కూడా సర్వస్వతంత్రుడు. ఒక వ్యక్తి ఘనతకు సంబంధించి భాషా నిఘంటువుల్లో ఉన్న అన్ని పదాలూ కలిపితే వాటి ఏకీకృత రూపం నరేంద్రమోదీ. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాజీకీయ చరిత్రలోనే ప్రతిపక్షాన్ని ఇంతగా ఊచకోత కోసిన నాయకుడు మరొకరు లేరు. మోదీని, ఆయన నాయకత్వంలోని బీజేపీని సవాల్‌ చేయగల బలమైన నాయకుడు జాతీయ స్థాయిలో కనిపించడం లేదు. ఇప్పటికే క్షీణించిన కాంగ్రెస్‌.. రాబోయే రెండేళ్లలో ఆ పార్టీ మరింత బలహీనపడుతుందని పరిశీలకుల అంచనా.

ఒక్క రాష్ట్రంలో ఎన్నికల విజయంతో అటు జాతీయ పార్టీలను మూగపోయేలా చేసిన మోదీ.. ప్రాంతీయ  పా్ర్టీల్లో గుబులు రేకెత్తించారు. భారత రాజకీయాల్లో మోదీ నాయకత్వంలోని బీజేపీ మాత్ర మే ప్రధాన రాజకీయ పక్షంగా నిలిచింది. పైగా మోదీ సర్కారుకు సంబంధించినంత వరకూ ప్రభుత్వ వ్యతిరేకత సూచనలేవీ బలంగా కనిపించడంలేదు. దీంతో 2019లో మళ్లీ మోదీ గెలుపు తథ్యంగా కనిపిస్తోంది.
 
దేశవ్యాప్తంగా మూడేళ్లుగా మోదీ మ్యాజిక్‌ కొనసాగుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికలతో మొదలైన మోదీ హవా.. ఢిల్లీ, బీహార్‌ ఎన్నికల ఫలితాల తర్వాత కాస్త తగ్గిందనుకున్నా.. యూపీ, ఉత్తరాఖండ్‌ ఫలితాలతో మళ్లీ తెరపైకి వచ్చింది. మోదీ కేంద్రంగా జరిగిన ప్రచారంలో ఘన విజయం సాధించటంతో మోదీ మహిమ ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. తాజా ఫలితాలతో దేశ రాజకీయాల్లో,  పార్టీ వ్యవహారాల్లోనూ మోదీ స్థానం మరింతగా బలపడింది.  
 
దేశంలో 3 దశాబ్దాల తర్వాత బీజేపీ సంపూర్ణమైన మెజారిటీ సాధించింది. కానీ ఇదంతా లోక్‌సభలోనే. రాజ్యసభలో బీజేపీ మైనారిటీలో ఉంది. బిల్లులను అమలుచేసుకోవాలంటే విపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. భూసేకరణ బిల్లు, జీఎస్‌టీ బిల్లు వంటివి ప్రతిపక్షాల అభ్యంతరాలతో చాలా కాలం పాటు పెండింగ్‌లో పడిపోయాయి. యూపీ, ఉత్తరాఖండ్‌ విజయాలతో పెద్దలసభలో ఎన్డీయేకు కొంత సానుకూలత ఏర్పడుతుంది. కానీ ఇందుకు మరికొంత సమయం వేచి చూడక తప్పదు. మొత్తం 250 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీయేకి 74 మంది (బీజేపీ 56) సభ్యులున్నారు. ఇక కాంగ్రెస్‌కు 59 మంది సభ్యుల బలముంది.
 
రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం జూలై 25న, ఉప రాష్ట్రపతి పదవీకాలం ఆగస్టులో ముగుస్తుంది. అయితే, తాజా ఫలితాల నేపథ్యంలో రాష్ట్రాల అసెంబ్లీల్లో బీజేపీ బలం పెరగనుండటంతో తనకు కావాల్సిన వ్యక్తిని రాష్ట్రపతిగా ఎన్నుకునేందుకు బీజేపీకి అవకాశం ఉంటుంది. బీజేపీ ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉంది. జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్‌ల్లో సంకీర్ణ భాగస్వామిగా ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు కూడా బీజేపీ ఖాతాలో చేరడంతో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి చాలా సానుకూలత ఏర్పడింది.
 
ప్రధాని మోదీ సాహసోపేతంగా తీసుకున్న నోట్లరద్దు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారని యూపీ, ఉత్తరాఖండ్‌ ఫలితాలు చెబుతున్నాయి. మరిన్ని కఠిన నిర్ణయాలుంటాయని అప్పుడే మోదీ ప్రకటించినా.. పెద్దనోట్ల రద్దుతో ప్రజల్లో అసంతృప్తి వెల్లువెత్తటంతో ‘కఠిన నిర్ణయాల’పై కాస్త తగ్గినట్లు కనిపించింది. తాజా విజయాలతో మోదీ దూకుడుగా ‘కఠిన’ కొరడా ఝళిపించే అవకాశముంది. బినామీ ఆస్తుల వంటి పలు చట్టాలతోపాటుగా కీలకమైన సంస్కరణల విషయంలో మోదీ దూకుడు పెంచుతారని నిపుణులు భావిస్తున్నారు.

ఇప్పటివరకూ తన కీలక సైద్ధాంతిక అజెండా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న బీజేపీ.. మున్ముందు ఆ అజెండాను పూర్తిస్థాయిలో ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశీలకుల అంచనా. రోజు రోజుకూ బలపడుతున్న పార్టీ.. ఉమ్మడి పౌర స్మృతి, అయోధ్య, కశ్మీర్‌కు సంబంధించిన 370వ అధికరణ వంటి వివాదాస్పద అంశాలనూ తిరగదోడుతుందని భావిస్తున్నారు.
 
ఏది ఏమైనా. ఇప్పుడు నడుస్తున్నది మోదీ యుగం. వచ్చే ఎన్నికల వరకు ఈ యుగానికి, దాని ప్రభావానికి తిరుగులేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ బీకాంలో ఫిజిక్స్‌ గొడవేంటి బాబూ.. విరగబడి నవ్విన చంద్రబాబు