దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఆమె వెంటే ఉన్నారని, ఆమె మరణ రహస్యం ఆయనకు తెలుసని, ఆమె మరణంపై ఎందుకు దర్యాప్తు జరిపించలేదని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రశ్నించారు. అలాగే అన్నాడీఎంకే నేతలు ఓట్ల కోసమే హామీలను గుప్పిస్తున్నారని, తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలు అంటూ కోట్ల రూపాయలు ప్రకటనలకు వెచ్చిస్తున్నారని ధ్వజమెత్తారు.
తేని జిల్లాకు చెందిన పన్నీర్‌సెల్వం మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించినా, తన స్వంత నియోజకవర్గం తేని అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. జయకు పన్నీర్‌సెల్వం నమ్మకమైన అనుచరుడు కాదన్నారు.
జయ మరణంలో ఉన్న రహస్యాన్ని బయట పెడతానని 'ధర్మయుద్ధం' ప్రకటించిన ఓపీఎస్.. నేటికీ ఆ దిశగా ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో కరెప్షన్, కలెక్షన్, కమిషన్ పాలన సాగిస్తున్న అన్నాడీఎంకే ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్టాలిన్ అన్నారు.