కరోనా కాలంలో ఆకాశాన్ని అంటిన కొన్ని మెడికల్ పరికరాల ధరలు ఇప్పుడు దిగివచ్చాయి. కీలకంగా ఉన్న ఆక్సిమీటర్లు, బీపీ చెకింగ్, నెబ్యూలైజర్, గ్లూకో మీటర్ తదితర వస్తువుల ధరలు తగ్గిస్తూ…కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ధరలు 2021, జూలై 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. 2022 జనవరి 31 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయని తెలిపారు.
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు కొన్ని మెడిసిన్స్ అవసరం పడ్డాయి. దీనిని పలు మెడికల్ షాపులు క్యాష్ చేసుకున్నాయి. అమాంతం ధరలు పెరడంతో సామాన్యుడు అల్లాడిపోయాడు. వేలల్లో ఉన్న వస్తువులను కొనల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పల్స్ ఆక్సిమీటర్లు, గ్లూకో మీటర్, బీపీ చెకింగ్ మెషిన్, డిజిటల్ థర్మో మీటర్, నెబ్యూలైజర్, వంటి మెడికల్ పరికరాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది.
ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఐదు మెడికల్ పరికరాలపై ట్రేడ్ మార్జిన్ ను ప్రభుత్వం పరిమితం చేసినట్లు మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. పలు మెడికల్ పరికరాల ధరలు గణనీయంగా తగ్గనున్నట్లు తెలిపారు. ఫార్మాస్యూటికల్ డ్రగ్స్, సంబంధిత పరికరాల ధరలను నియంత్రించే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథార్టీ (NPAA), ప్రైజ్ టూ డిస్ట్రిబ్యూటర్ (PTD) స్థాయిలో 70 శాతం ధరలను పరిమితం చేసింది.
ఐదు మెడికల్ పరికరాలకు చెందిన 684 ఉత్పత్తులు, 620 ఇతర ఉత్పత్తుల ధరల్లో సుమారు 88 శాతం తగ్గనున్నాయని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ కోవిడ్ - 19 సంబంధిత మెడికల్ ఉత్పత్తులను తగ్గించిన విషయం తెలిసిందే. ఇతర పరికరాలతో సహా కోవిడ్ - 19 ముఖ్యమైన వస్తువులపై ఆదాయపు మంత్రిత్వ శాఖ పన్ను మాఫీ చేసింది.