కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు శివారు మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. భీమన అమావాస్య సందర్భంగా భర్తకు పాదపూజ చేసింది. కానీ, ఆ పతి దేవుడు మాత్రం ఏమాత్రం కనికరించలేదు. వీటికేం తక్కువ లేదు.. తేవాల్సిన కట్నం జాడ మాత్రం కానరాదు అంటూ ఆయన దెప్పిపొడుస్తుందంటే పంటి బిగువునే తన బాధను అణుచుకుంది. తన బాధనంత తోడపుట్టిన సోదరితో పంచుకుంది. చివరకు బలవన్మరణానికి పాల్పడింది.
భీమన అమావాస్య సందర్భంగా గురువారం మధ్యాహ్నం ఆమె ఇంట్లో ఎంతో భక్తితో పూజలు చేసి కుటుంబం సంప్రదాయం ప్రకారం కంకణం కట్టుకుని భర్తకు పాదపూజ చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఆ తర్వాత భర్త చీటిపోటి మాటలు అన్నారు. వీటన్నింటిని తన బాధను అణుచుకుంది. మధ్యాహ్నం చెల్లితో తన బాధనంతా పంచుకుంది. ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే దానికి అభిషేక్‌తో పాటు ఈ ఇంటి వారందరికీ పాపం ఉన్నట్టే అంటూ సెల్‌ఫోన్ చాటింగ్‌లో వాపోయింది. అలాంటిదేమీ ఉండదులే అక్కా అని చెల్లి సర్దిచెప్పినా, పరిస్థితి చేయిదాటిపోయింది.
రాత్రి 8.30 గంటలకంతా ఆ ఇంట మృత్యుగంట మోగింది. పెళ్ళయిన యేడాదిలోపే ఆమె ఊపిరి వదిలింది. ప్రేమించి వివాహం చేసుకున్న భార్య స్పందన (22)ను గురువారం రాత్రి హత్య చేసి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించిన ఆరోపణలపై అభిషేక్ అనే వ్యక్తిని బెంగుళూరు శివారు మాదనాయకనహళ్లి ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. భార్యతో పాదపూజ చేయించుకుని చివరికి కట్నం కోసం హత్య చేశాడని స్పందన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెకు ఉరి బిగించి హత్య చేసి, ఆత్మహత్యగా చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడి నుంచి వివరాలు రాబట్టేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.